ఒక ప్రొఫెసర్ పై 500మంది అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనీ, అతను తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనీ పేర్కొంటూ వారు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.
హర్యానాలోని సిర్సాలో ఉన్న చౌదరి దేవీలాల్ యూనివర్శిటీకి చెందిన 500మంది విద్యార్థినులు ఇటీవల అదే యూనివర్శిటీలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ పై ఆరోపణలు చేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని, తమను విడి విడిగా తన కార్యాలయంలోని బాత్రూమ్ వద్దకు పిలిచి, తాకరాని చోట్ల తాకుతున్నాడని, తాము వ్యతిరేకిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నాడని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ ముందు జాగ్రత్తగా తన గదిలోని సిసి టివి ఫుటేజీతోపాటు ఇతర సాక్ష్యాలను ధ్వంసం చేశాడని వారు ఆరోపించారు. యూనివర్శిటీ అధికారులపై తమకు నమ్మకం లేదని, రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థునులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రొఫెసర్ పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మూడుసార్లు వారు ఫిర్యాదు చేశారు. అయితే యూనివర్శిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ప్రొఫెసర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.
అయితే విద్యార్థినుల ఆరోపణలను ప్రొఫెసర్ ఖండించారు. వారి ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని, విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు.