Monday, January 20, 2025

హక్కుల యోధుడు సాయిబాబా

- Advertisement -
- Advertisement -

Saiప్రభుత్వ కాంక్ష తీరనే లేదు. ‘నేను చావుని ధిక్కరిస్తున్నాను’ అని ప్రతిజ్ఞ చేసిన జి ఎన్ సాయిబాబా జైలు బయటే మరణించారు. తొమ్మిదేళ్ల పాటు నాగపూర్ జైల్లోని అండా సెల్ తనను వేపుకుతిన్నా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. శారీరకంగా తొంభై శాతం అంగవైకల్యం ఉన్న సాయిబాబా ఇప్పుడు మన దేశంలో సాగుతున్న ఫాసిస్టు పాలనకు సాక్ష్యంగా ప్రపంచం ముందు నిలబడ్డారు. హింసకు నాజీ ఇజం పర్యాయపదం. ‘నాజీల మించినవురో..’ అనే పాట ఒకటి ఉంది. అది ఇప్పుడు మన దేశాధినేతకు సరిగ్గా సరిపోతుంది.

సామ్రాజ్యవాదానికి బంట్లుగా పనిచేస్తున్న పాలకులు దేశఖనిజ సంపదను దోచిపెట్టేందుకు ఎంతకైనా సిద్ధపడతారు. గిరిజనులకు అడవిలోంచి గెంటేసి ఆ నేలలో ఉన్న ఖనిజాన్ని విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేస్తారు. గిరిజన హక్కులకు ఈ చర్యలు భిన్నమని అడ్డొచ్చిన వారిని దేశద్రోహులుగా చిత్రించి అక్రమ కేసులతో వారిని జైళ్లలో బందీలుగా చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసాన్ని నలిపేసేందుకు జైలు చట్టాలను కాలరాస్తారు. ఒక ప్రశ్నను ఊపిరాడకుండా చేస్తే మరో ప్రశ్న గొంతు పెగలకూడదు. కొత్త ప్రశ్నలు వణికిపోయేలా హింస ఉండాలి. అందుకోసం దేశంలోని కోర్టులు, న్యాయమూర్తులు, జైళ్లు, జైలర్లు ఒక్కటై రాజ్యానికి ఊడిగం చేసేందుకు సిద్ధమే. ప్రజలకు ఉన్న హక్కులను అడిగేవాడిపై అర్బన్ నక్సలైట్ ముద్రవేయాలి.

వాడి కుటుంబాన్ని ప్రశాంతత లేకుండా చేయాలి. కేసుల్లో ఇరికించి జైళ్లలో మగ్గించి, శరీరాన్ని పిప్పిచేసి చంపేయాలి. ఒకరిపై చేసే ఈ హింస, క్రూరత్వం చూపించి హక్కుల పేరెత్తేవాడికి భయం పుట్టించాలి. అన్నీ బాగున్నవాడి కన్నా అంగవైకల్యం ఉన్నవాడిపై తమ ప్రతాపం చూయిస్తే ఫలితం మరీ బాగుంటుందని రాజ్యం పేరాశ. అందుకు దొరికిన ప్రయోగజీవియే సాయిబాబా. అందుకే ఉపా చట్టం కింద సాయిబాబాతో పాటు అరెస్టయినవాళ్లకు బెయిల్ వచ్చినా, అతన్ని మాత్రం వచ్చిన బెయిళ్లను కొట్టేస్తూ తొమ్మిదేళ్ల పాటు నాగపూర్ అండా సెల్ లో కుక్కేశారు.

బాల్యంలోనే కాళ్లు చచ్చుబడిపోయిన సాయిబాబా శరీరాన్ని ఈడ్చుకుంటూ యూనివర్శిటీ మెట్లెక్కి ఉన్నత చదువులు అందుకున్నారు. ఇంగ్లీష్‌లో పిహెచ్‌డి చేసి ఢిల్లీలోని కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. స్వతహాగా పౌరహక్కులపై గౌరవంతో ఉద్యమాల్లో పాల్గొనే ఆయన ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్‌లో చేరి 1995లో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 9 మే 2014 నాడు కాలేజీ నుండి ఇంటికి వస్తుండగా పోలీసులు ఆయనను పట్టుకొని గడ్చిరోలికి తీసికెళ్లారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఉపా చట్టం కింద కేసు పెట్టి నాగపూర్ సెంట్రల్ జైలుకు పంపారు. తమకు సాయిబాబా సహకరిస్తున్నారని 2013లో పట్టుబడిన మావోయిస్టు కార్యకర్తలు తమ వాంగ్మూలంలో చెప్పారనే ఒకే మాటపై సాయిబాబా పోలీసుల బారినపడ్డారు.

తప్పించుకు పోతాడనే అనుమానంతో సర్వదా పోలీసుల నిఘా ఉండే ఎలుకల బోనులాంటి సెల్‌లో కుర్చీకి అతుక్కుపోయే ఆయన్ని వేశారు. ఒకరి చేయిస్తే తప్ప కదలలేని మనిషిని అలా ఉంచడం హేయమైనది. జైలు సూపరింటెండెంట్ తీసుకొనే ఈ నిర్ణయాలపై కోర్టు జోక్యం చేసుకోదు. అంగవైకల్యం ఉన్నందున సాయిబాబాకు నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించాలని ఎన్ని విన్నపాలు చేసిన ఫలితం రాలేదు. ఒక కోర్టు బెయిల్ ఇవ్వగానే మరో కోర్టు దాన్ని రద్దు చేసేది. ఇదంతా ప్రభుత్వం పన్నిన భారీ కుట్రలో భాగమే అనిపిస్తుంది. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకు జీవితఖైదు శిక్ష వేసింది. 2022లో బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. పునర్విచారణ కోరుతూ ఆ తీర్పును మర్నాడే సుప్రీం కోర్టు నిలిపివేసింది. మళ్ళీ విచారణ జరిపిన బాంబే హైకోర్టు 5 మార్చి 2024 నాడు సాయిబాబాను మళ్ళీ నిర్దోషిగా ప్రకటించింది.

కేసులో సమర్పించిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవని కోర్టు పేర్కొనడం గమనార్హం. పట్టుకెళ్లిన నాటి నుండి విడుదలయ్యే దాకా తనకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని సాయిబాబా చెపుతూనే ఉన్నారు. ఆయన మాట నిజమని తేల్చడానికి చట్టానికి పదేళ్లు పట్టింది. చేయని నేరానికి ఎన్ని తిప్పలు పడ్డా బెయిల్ దొరకలేదు. చివరకు తల్లి చనిపోయినా చివరిచూపు దక్కలేదు. ఆయన్ని ఇంతేసి ఇబ్బందులపాలు చేసే హక్కు చట్టానికి ఎవరిచ్చారు? ఆయన భార్య, కూతురు పడిన మానసిక క్షోభకు బాధ్యులెవరు? ఉన్నత ఉద్యోగం పోయి, చికిత్సలకు కూడా డబ్బు సరిపోని పరిస్థితికి కారణమెవరు? రాజకీయ పెద్దలైన శరద్ పవర్, సిహెచ్ విద్యాసాగర్ రావు లాంటి వారి మాటలు కూడా పనిచేయలేదు. జరిగిన నష్టానికి మన చట్టాల్లో జవాబు లేదు. జైలులో తాను ఎలా ఉండేదీ, తన ఆరోగ్యం ఎలా దెబ్బ తిన్నదీ అనే విషయాలపై సాయిబాబా పత్రికల్లో వివరించారు. అండా సెల్‌లో 14 నెలలు గడిపిన తర్వాత అక్టోబర్ 2015లో రాసిన వ్యాసంలో ఆ సమయం 14 ఏళ్లుగా అనిపించింది అన్నారు. తాను మరో వంద నెలలు అక్కడే ఉండవలసి వస్తుందని అప్పటికి ఊహించి ఉండరు.

ఎనిమిది నెలల తర్వాత వెస్టర్న్ కమోడ్ ఏర్పాటు చేశారు. అదీ కూడా సరిగ్గా పని చేసేది కాదు. రోజుకు ఒక బకెట్ నీళ్లు మాత్రమే లభించేవి. తనకు వెన్నుపాములో సమస్య ఉందని తెల్సినా పోలీసులు తన చేతులు పట్టుకొని లాక్కుపోయేవారని, దాని వల్ల నరాలు దెబ్బతిని ఎడమవైపు శరీరం పనిచేయడం మానేసిందని రాశారు. సరియైన వైద్యం చేయించకుండా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవారు. దాని వల్ల శరీరం మరిన్ని రోగాలకు నిలయమైంది. జైల్లోకి వెళ్లేముందు కాళ్లు పనిచేయకపోవడం తప్ప తనకు ఏ అనారోగ్యం లేదు. 21 రకాల వ్యాధులతో బయటికి వచ్చాను.

ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తే తన ఆరోగ్యం దెబ్బ తినేది కాదు అన్నారు. విడుదల తర్వాత ఢిల్లీలో మార్చి 9 న విలేకరులతో మాట్లాడుతూ ఆయన ‘మీ ముందు సజీవంగా కనబడుతున్నాను కానీ శరీరంలోని అవయవాలన్నీ విఫలమైనాయి’ అన్నారు. అదో భయంకర సత్యం. ఆ మాటన్న ఆరు నెలలకే, 57 ఏళ్ల వయసులో సాయిబాబా జీవితం ముగియడం విషాదకరం. తన కుటుంబంతో, సన్నిహితులతో ఆయన ఇంకా ఎంతో కాలం బతకాల్సింది. కోల్పోయిన జీవితానికి ఫలితం దక్కకుండానే నిష్క్రమించడం బాధాకరం. వైకల్యం అనుభవిస్తూ ఆయన మానవ హక్కుల కోసం దృఢంగా నిలబడడం, ఎంతటి కష్టాలకైనా సిద్ధపడడం అనన్యమైనది. అలా ఆయన ఎందరిలోనో స్ఫూర్తి నింపుతూ తన జీవితాన్ని అజరామరంగా మలచుకున్నారు.

బి. నర్సన్

9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News