Tuesday, November 5, 2024

కూరగాయలు అమ్ముతున్న ప్రొఫెసర్ గారు!

- Advertisement -
- Advertisement -

నిన్నటివరకూ యూనివర్శిటీలో పాఠాలు చెప్పిన ఓ ప్రొఫెసర్ జీతం డబ్బులు చాలక, కూరగాయల అమ్మకం మొదలుపెట్టారు. ఆయన పేరు సందీప్ సింగ్. పైగా పీహెచ్ డీ చేసి, డాక్టరేట్ కూడా పొందారు. అయితే ఏం లాభం? తాను చదివిన చదువులు, చేస్తున్న ఉద్యోగం పొట్ట నింపడం లేదంటున్నారాయన.

డాక్టర్ సందీప్ సింగ్ చిన్నప్పటినుంచే చదువుల్లో ఫస్ట్. ఏకంగా నాలుగు పీజీ డిగ్రీలతోపాటు పిహెచ్ డీ కూడా చేశారు. పంజాబ్ యూనివర్శిటీలో పదేళ్లపాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఐదేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోగానూ, ఏడేళ్లు గెస్ట్ ఫాకల్టీగానూ పనిచేశారు. అయితే యూనివర్శిటీవారు ఇచ్చే నామమాత్రపు జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని ఆయన బాధపడేవారు.

ఓ శుభముహూర్తాన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి, కూరగాయల బండీ తిప్పడం మొదలుపెట్టారు. ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముతున్నారు. ఆయన బండిపైన ‘పిహెచ్ డీ సబ్జీవాలా’ (పిహెచ్డీ కూరగాయలవాడు) అనే బోర్డును కూడా తగిలించుకున్నారు. ‘ప్రొఫెసర్ గా పనిచేయడంకంటే కూరగాయలు అమ్ముకోవడమే నయం. ఎందుకంటే ఇప్పుడు కాసిని డబ్బులు సంపాదించగలుగుతున్నాను’ అంటున్నారు సందీప్ సింగ్.

ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కూరగాయలు అమ్మాక, ఇంటికి చేరుకుని కాసేపు తన కుమారుడికి పాఠాలు చెబుతారు. ఆ తరవాత తాను చదువుకోవడం మొదలెడతారు. ఇంకా ఏం చదువుతున్నారనే కదా మీ డౌట్? సందీప్ సింగ్ ప్రస్తుతం బి.లిబ్ (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్) చదువుతున్నారు. అదీ సంగతి! భవిష్యత్తులో కోచింగ్ సెంటర్ పెట్టి, విద్యార్థులకు పాఠాలు చెబుతునంటున్నారు ఈ సింగు గారు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News