ఇంఫాల్: మణిపూర్‌లో తెగల మధ్య ఆరని చిచ్చుకు బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తి కారణం అని వెల్లడైంది. ఉదయ్ రెడ్డి అనే ఈ వ్యక్తిపై స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయ్‌రెడ్డి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ వర్శిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
మణిపూర్‌లో మతాల పేరిట ఆయన పలు వర్గాల నడుమ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాడని మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఉదయ్ రెడ్డిపై ఎప్‌ఐఆర్ దాఖలు అయింది. ఈ వ్యక్తి కెనడాలోని ఖలీస్థానీ శక్తులతో లింకులు పెట్టుకున్నాడని, మణిపూర్‌లో ఘర్షణలను రెచ్చగొడుతున్నాడని ప్రాధమిక సమాచారం అందింది. దీనితో ఈ దిశలో మణిపూర్ పోలీసు బృందాలు విచారణకు సిద్ధం అయ్యాయి. మణిపూర్‌లో చాలా నెలలుగా మైతీలు, నాగాల కుకీ తెగల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. ఈ వ్యక్తి తన రాతలతో ఇతరత్రా మైతీల మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించాడని ఫిర్యాదులో వెల్లడైంది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో ఈ ఫిర్యాదు దాఖలు అయింది. ఈ వ్యక్తి పనిచేస్తున్న బర్మింగ్‌హామ్ వర్శిటీకి ఇతని వివరాల గురించి తెలుసుకునేందుకు అధికారులు ఫోన్లు చేయగా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
ఇక ఉదయ్ రెడ్డి నుంచి కూడా ఈ విషయంలో ఇప్పటివరకూ పత్రికా ప్రకటన వెలువడలేదు. వివరణ రాలేదు. ఉదయ్ రెడ్డి ఆయన అనుచరుల చట్టవ్యతిరేక కార్యకలాపాలు దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రత సమైక్యతలకు భంగకరం అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కోణంలోనే ఆయనపై దర్యాప్తు వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు. కాగా ఈ వ్యక్తికి ఖలీస్థానీ వర్గాలతో పాటు నార్కో టెర్రరిస్టు బృందాలతో కూడా సంబంధం ఉందని, నిందితుడి ఫోన్‌కాల్స్, ఆయన ఆర్థిక కార్యకలాపాలను ఆరాతీయాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా ఈ వ్యక్తి ఎక్స్ సామాజిక మాధ్యమం ఖాతా నిలిపివేసి ఉంది. రెడ్డి తరచూ సామాజిక మాధ్యమంలో పలువురితో ఫోన్లలో మాట్లాడటం, ఆడియో ప్రసంగాలకు దిగడం వంటి పనులు చేస్తున్నాడు.
మణిపూర్‌లో చట్టపరిరక్షక సంస్థలను ఏ విధంగా ప్రతిఘటించాల్సి ఉందనేది కూడా చెపుతున్నాడని, సవివరణలతో ఫిర్యాదీ పోలీసులకు తెలిపారని వెల్లడైంది. ఈ వ్యక్తి కదలికలను ఎప్పటికప్పుడు పసికట్టేందుకు , కార్యకలాపాలను అదుపులో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికారికంగా చట్టపర సంస్థలు లుకౌట్ సర్కులర్ జారీ చేయాలని , దీని వల్ల దర్యాప్తు మరింత తేలిక అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖకు తగు సమాచారం అందించవచ్చునని వెల్లడైంది. ఈ కీలక నిందితుడు ఉదయ్‌రెడ్డి ఏ ప్రాంతం వాడనేది స్పష్టం కాలేదు. ఈ వివరాలు తెలిస్తే సమగ్ర దర్యాప్తునకు వీలేర్పడుతుందని వెల్లడైంది.