అచ్చంపేట : అభివృద్ధితోనే అచ్చంపేట ప్రగతి సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని 01, 13, 14వ వార్డులలో రూ. 1.44 కోట్ల పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మెన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, అచ్చంపేట ప్రజల కోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు.
నిరంతరం నల్లమల ప్రాంత ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ హయాంలో అచ్చంపేట ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా దోచుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ వైపే ఉండాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు 13వ వార్డులో డప్పు వాయిద్యాల నడుమ మహిళలు బతుకమ్మ ఆటపాటలతో ఎమ్మెల్యే గువ్వలకు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలికారు.
అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు అంతటి శివకృష్ణ, నాయకులు శేఖర్, టౌన్ అధ్యక్షులు పులిజాల రమేష్, ఆనంద్, సాంబయ్య, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.