Friday, November 22, 2024

చదువుల కల సాకారం-సమాజం బాధ్యత

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనా ఫలాలు తరగతి గదుల్లో అమలుకు నోచుకుంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా నేటికీ భారతీయ విద్యా వ్యవస్థ నత్త నడకతో సాగుతుందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో పిల్లలకు ఏం కావాలి? పిల్లలు ఏం కావాలి అని ఆలోచించ గలిగిన విద్యావేత్త డా. బెల్లి యాదయ్య రాసిన ‘చదువుల కల’ వ్యాసాలు నేటి భారత విద్యా వ్యవస్థలో వేళ్ళూనుకున్న లోపభూయిష్టత, రావలసిన మార్పులు, అందు కు సమాజం చేయవలసిన కృషి తదితరాంశాలను శాస్త్రీయంగా, సోపపత్తికంగాచర్చించాయి.

డా. బెల్లి యాదయ్య మూడున్నర దశాబ్దాలుగా అధ్యాపన రంగంలో ఉన్నవారు, సుమారు వెయ్యి పాఠశాలలు తిరిగి క్షేత్ర స్థాయిలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన వారు. కనుకనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యపై జరుగుతున్న పరిశోధనలను నిశితంగా గమనిస్తూ వాటిని భారత సమాజంలో ఏ విధంగా అన్వయించుకోవచ్చు తెలిపే విధంగా వ్యాసాలు రాస్తున్నారు. కరోనా అనంతరం విద్యారంగం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిని అధిగమించడానికి ఈ ‘చదువుల కల’ వ్యాసాలు ఒక మార్గనిర్దేశం చేస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ వ్యాసాలలో సందర్భానుసారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యావేత్తలు, పరిశోధకులు, రచయితలు పేర్కొన్న మాటలను ఉటంకించడం ద్వారా వీటికి మరింత సాధికారత చేకూరింది. గిజుబాయి, చుక్కా రామయ్య తర్వాత అంతటిస్థాయిలో విద్యారంగంపై సీరియస్‌గా రాస్తున్నవారు డా.బెల్లి యాదయ్య.

ఈ ‘చదువుల కల’ వ్యాసాలు గత రెండు సంవత్సరాలుగా ‘మన తెలంగాణ’ పత్రికలో ధారావాహికగా ప్రచురితమవుతున్నాయి. ఈ గ్రంథంలోని అనేక వ్యాసాలు ఇప్పటికే ఉపాధ్యాయ ప్రపంచంలో వైరల్ అయి ఆలోచింపజేశాయి. ఈ వ్యాసాలలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలో అమూల్యమైన సూచనలు చేశారు వ్యాసకర్త. విద్యాసంస్థల్లో అభ్యసన వాతావరణం కలుషితమవుతున్న వైనాన్ని గమనించి నెగిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ నుండి పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ వైపు విద్యా వ్యవస్థను మళ్లించవలసిన అవసరం ఉందంటారు. సానుకూల అభ్యసన వాతావరణం లేకపోతే విద్యార్థులు నిమగ్నతను, ఆసక్తినీ కనబరచలేరని అందుకే పాఠశాలకు సంబంధించి యాజమాన్యాలు, టీచర్లు, విద్యార్థులు నేర్చుకోదగిన సంస్కృతిని పాఠశాలల్లో పెంపొందించాలంటారు. మూల్యాంకనపు వ్యూహాల్లోనూ మార్పు రావాలంటారు.సృజనాత్మకత ఆవశ్యకతను గురించి తెలుపుతూ అర్థ జ్ఞానంలేని అభ్యాసన విధానం, వాచక కేంద్ర బోధన వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటారు.

సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అవసరం అంటారు. విద్యార్థులకు విశ్లేషణ సామర్థ్యాన్ని నేర్పించడంలో చతుర్విద భాషా ప్రక్రియలను నేర్పే ప్రాథమిక దశలోనే విశ్లేషణ సామర్థ్యం అలవర్చడానికి బీజాలు వేయాలంటారు. ఒక విద్యార్థి, పరిశోధకుడిగా, మేధావిగా ఎదగాలి అంటే విశ్లేషణాసామర్థ్యం కీలకమంటారు. గత విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో రీడ్ (read enjoy and development) అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రంథాలయాలను నిరంతర అధ్యయన శాలలుగా మార్చడానికి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ బెల్లి యాదయ్య రాసిన వ్యాసంలో కేవలం విద్యార్థులే కాక తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని అభిలషించారు.

దేశ సంపద సృష్టికి సహజ వనరులు ఎంత ముఖ్యమో మేధో వనరులు కూడా అంతకంటే ముఖ్యమని, అందుకు ఉపాధ్యాయ వృత్తి ప్రమాణాలు మెరుగైనప్పుడే నాణ్యత సమర్ధతతో కూడిన విద్య సమాజానికి అందుతుంది అని అభిప్రాయపడ్డారు. ‘ఉపాధ్యాయుడు మేధో వనరుల వనరు. వృత్తి ప్రమాణాలు లోపించకుండా జాగరూకత వహించాల్సిందే’ అని హెచ్చరించారు. ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఆధారంగా ఇటీవల విస్తరిస్తున్న ప్లాట్ఫామ్స్ ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ప్రపంచ స్థాయిలో పరస్పర జ్ఞాన వినిమయానికి తోడ్పాటునందిస్తున్నాయని, వీటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటారు. రచయిత క్షేత్ర పర్యటనలో భాగంగా దర్శించిన హనుమకొండలోని బాలసముద్రం అంగడి బడిని ఉదహరిస్తూ సంతలో కూరగాయలు అమ్ముకునే మహిళలకు ప్రేరణ ఫౌండేషన్ ఖాళీ సమయాల్లో విద్యను నేర్పడం గొప్ప ప్రయోగాత్మకమని అభివర్ణించారు.

దీని ఫలితంగా ఆ మహిళల్లో వ్యాపార నిర్వహణ సామర్థ్యం, ప్రాపంచిక అవగాహన మెరుగవుతున్నదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అన్ని రంగాలను అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా. ప్రత్యేకించి విద్యారంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కరోనా ఫలితంగా నష్టపోయిన విద్యారంగాన్ని కరోనా కాలంలో కోల్పోయిన చదువును తిరిగి అందించడం ద్వారా అభ్యసన పునరుద్ధరణ చేసి పూర్వవైభవం కల్పించవలసిన అవసరాన్ని డా. బెల్లి యాదయ్య ఈ వ్యాసాల్లో చెప్పారు.
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ ‘మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోండి, ఇతరులను కూడా మీతో పాటు ఎదగనివ్వండి’ అనే గొప్ప సందేశాన్ని సమాజానికి అందించారు. పాలకులకు, ప్రభుత్వాలకు విద్య ప్రథమ ప్రాథమ్యం అయినప్పుడే జాతీయోద్యమ స్వప్నాలైనా సమానత, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందంటారు.

విద్యారంగంలో సమానత్వాన్ని, గ్రీన్ కరికులంను కలగనడం ద్వారా బెల్లి యాదయ్య విద్యా దృక్పథాన్ని అంచనా వేయవచ్చు. సమా జం ఎదుర్కొంటున్న తీవ్రమైన మరొక సమస్య పర్యావరణ విధ్వంసం. దీని నుండి ప్రపంచాన్ని కాపాడుకోవడానికి గ్రీన్ కరికులం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎదురు దెబ్బలతోనే గెలుపు మధురిమ, పోటీని చవిచూస్తేనే విజయం, పట్టుదలే విజేతల పెట్టుబడి మొదలైన వ్యాసాలు వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసేవిగా ఉన్నాయి. విద్యారంగంతో పాటు వైజ్ఞానిక, ఆర్థిక, సామాజిక రంగాలలోని అనేక అంశాలను ఈ వ్యాసాలు చర్చించాయి.
‘చదువుల కల’ చదివిన తర్వాత విద్యా కళాశాలలో అనాదిగా, సంప్రదాయకంగా వస్తున్న సిలబస్ మార్పు చేయవలసిన అవసరం ఉందనిపిస్తోంది.

‘చదువుల కల’ వ్యాసాలను కూడా ఉపాధ్యాయ విద్య సిలబస్‌లో చేర్చాలి. విశ్వవిద్యాలయ ఆచార్యులు మొదలు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల వరకు విధిగా ఈ పుస్తకం చదవవలసిన అవసరం ఉంది. పాఠశాలలు నడిపే వ్యవహార్తలు, ఛాత్రోపాధ్యాయులు, విద్యావేత్తలు జిల్లా, రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు ‘చదువుల కల’ వ్యాసాలు తప్పక చదవాలి. దీని వల్ల మన ఆచరణలో తప్పకుండా మార్పు వస్తుందని బలంగా విశ్వసిస్తున్నాను. ఈ వ్యాసాలు మరింతగా క్షేత్రస్థాయికి చేరాల్సిన అవసరం ఉంది. డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా విధి నిర్వహణ చేస్తూనే వందలాది పుస్తకాలు చదివి వ్యయ ప్రయాసలకోర్చి పలు జిల్లాలు, రాష్ట్రాలు తిరిగి ఎంతో అధ్యయనంతో ఈ వ్యాసాలు రాసిన డాక్టర్ బెల్లి యాదయ్యకి హృదయపూర్వక అభినందనలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News