Thursday, January 23, 2025

మేడమ్ కు ప్రగతి నివేదిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుం చి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లీమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పిసిసి తీర్మానించిన విషయాన్ని ఆయన సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచే పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. న్యూఢిల్లీలోని సోనియాగాంధీ అధికారిక నివాసం 10, జనపథ్‌లో ఆమెను సిఎం రేవంత్‌రెడ్డి సో మవారం సాయంత్రం కలిశారు. సిఎం రేవంత్‌రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, ప్రసార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను సిఎం రేవంత్‌రెడ్డి సోనియాగాంధీకి తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచడాన్ని అమ లు చేస్తున్నామని వివరించారు. బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందజేత, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని సోనియాగాంధీకి సిఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు.

బిసి కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నామని సోనియాగాంధీకి సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియాగాంధీకి సిఎం రేవంత్ తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు సోనియాగాంధీకి సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.

భారత్ న్యాయ్ యాత్రలో సిఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ న్యాయ యాత్రలో సోమవారం సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయ్ యాత్రలో రాహుల్‌గాంధీని సిఎం రేవంత్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు గ్యా రంటీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచి అమలు చేస్తున్న తీరును సిఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీకి వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేసేలా చూడాలని సిఎం రేవం త్ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరును రాహుల్‌గాంధీకి సిఎం రేవంత్ వివరించారు. సిఎం రేవంత్‌రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
గ్రాంటు విడుదలకు సహకరించండి
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతిఅయోగ్ వైస్ చైర్మన్‌ను సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం కలిశారు. హైదరాబాద్‌లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యం, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని నీతి అయోగ్ వైస్ చైర్మన్‌కు సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News