కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
న్యూఢిల్లీ: రెమిడెసివిర్ ఔషధం ఎగుమతులపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు వెలువరించింది. కరోనా తీవ్రత, వ్యాప్తి క్రమంలో ఈ ఔషధానికి ఏర్పడ్డ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎగుమతులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర ప్రాతిపదికన దీనిని కరోనా చికిత్సకు వాడుతున్నందున నిల్వలు దేశానికి పరిమితం చేసి, వినియోగించాలని నిర్ణయించుకుని ఇతర దేశాలకు ఉత్పత్తులు వెళ్లకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. ఔషధ నిల్వల వివరాలను వెబ్‌సైట్లలో ఉంచాలని, బ్లాక్‌మార్కెట్‌కు ఈ మందు తరలకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి కరోనా పరిస్థితులు కుదుటపడే వరకూ రెమ్‌డెసివిర్ ఔషధ సంస్థలు ఎగుమతికి దిగవద్దు.
కరోనా వైరస్ సోకి తీవ్ర అస్వస్థతతకు గురి అయిన వారికి రెమ్‌డెసివిర్ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ దశలో దీని డిమాండ్ పెరిగింది. ఇదే దశలో ఇతర దేశాలు కూడా దీనిని దిగుమతి చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అయితే దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరగడం, యాక్టివ్ కేసులు విషమ పరిస్థితిని సృష్టించడం వంటి పరిణామాలతో దేశంలోనే కరోనా ఔషధం అత్యధిక మోతాదులో అవసరం ఉంది. ఉత్పత్తిదారులు, పంపిణీదారులు రెమ్‌డెసివిర్ నిల్వలను దాచిపెట్టవద్దు.
ఎప్పటివకప్పుడు వెబ్‌సైట్‌లో కోటాల వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు నిల్వలను తనిఖీ చేయాలని కేంద్రం ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ కేసులకు చికిత్స జరిపేందుకు ఉపయోగించే యాంటి వైరల్ ఔషధం లేదా ఇంజెక్షన్ల కొరత ఉందని అనేక రాష్ట్రాలు కేంద్రానికి నివేదించాయి. కరోనా కేసులు విపరీత స్థాయితో పలు రాష్ట్రాలలో ఈ మందుల కోసం మందుల దుకాణాల వద్ద ప్రజలు క్యూలు కడుతున్నారు. పరిస్థితి నేపథ్యంలో సంబంధిత ఔషధ తయారీ సంస్థ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టారు.