Sunday, December 22, 2024

ప్రాజెక్టులు పదిలిమేనా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మొన్నమేడిగడ్డ.. పెద్దవాగు….నిన్న తుంగభద్ర..ప్రమాదపుటంచుల్లో ప్రాజెక్టులతో ఎప్పుడు ,ఎక్కడ ఏ ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లితుందో అని బిక్కుబిక్కుమని గడపాల్సివస్తోంది. కృష్ణా, గోదావరి,పెన్న నదుల పరివాహకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రాజెక్టులు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. అందులో శ్రీశైలం ప్రాజెక్టు మొదటి వరుసలో నిలిచింది. రాయల కాలం నుంచి మొన్నటి బ్రీటీష్ పాలకులు ,నిన్నటి నిజాం ప్రభువుల పాలనలో నిర్మించిన తాతల కాలం నాటి ఎన్నో కట్టడాలు చెక్కుచెదరకుండా నిలిచి నాణ్యతా ప్రమాణాలు అద్దం పడుతున్నాయి. మరో పైపు సాంకేతిక యుంగంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వేలకోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ప్రాజెక్టులు పగుళ్లిచ్చకుంటూ , చిన్న పాటి వరద ప్రవాహాలకు సైతం నిలదొక్కుకోలేక కొట్టుకుపోతూ నిర్మాణం సందర్బంగా దాగిన నాణ్యతా లోపాలను బయట పెడుతూ అధికార యంత్రాంగం అవినీతికి అద్దం పడుతున్నాయి.

నిర్వహణలో పాలకులు నిర్లక్షతను వెక్కిరిస్తున్నాయి. గత దశాబ్దకాలంలో కృష్ణా, గోదావరి ,పెన్నా బేసిన్ల పరిధిలోని పలు సాగునీటి ప్రాజెక్టులెన్నో కళ్లముందే కోట్టుకుపోయాయి. పదుల కొలది ప్రాణాలను బలితీసుకున్నాయి. అందులో పెన్నాకు ప్రధాన ఉపనదిగా ఉన్న చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయన ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఇప్పటికీ వణుకు పుట్టిస్తూనే ఉంది. ఈ ఘటనలో 50మంది ప్రాణాలుకోల్పాయారు. వరదనీటిలో చిక్కి వందల కుటుంబాలు నష్టపోయాయి. అంతకు ముందు కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల గేట్లు కోట్టు కొట్టుకుపోయాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు వరదవత్తిడితో ఊడిపోయాయి. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న కడెం ప్రాజెక్టు గేట్లు ఇప్పటికీ రెండు సార్లు కొట్టుకుపోయాయి. పాలెంవాగు, గుండ్ల వాగు ప్రాజెక్టులు కూడా రెండేసి సార్లు తెగిపోయాయి.

శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచిఉన్న ప్రమాదం :
తెలుగు రాష్ట్రాలకు వెలుగులు అందించే శ్రీశైలం ప్రాజెక్టు దశాబ్ధంన్నర కాలంగా ప్రమాదపుటుంచుల్లోనే బిక్కుబిక్కుమంటోంది. 2009 అక్టో బర్ 2 కృష్ణానదికి వచ్చిన భారీవరదతో శ్రీశైలం అనకట్ట గజగజలాడిపోయింది. 885అడుగుల గరిష్ట స్థాయి నీటిమట్టం, 215టిఎంసీల నీటినిలువ సామర్ధంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 12గేట్ల ద్వారా 13లక్షల క్యూసెక్కుల గరిష్టస్థాయి నీటి విడుదల లక్షంగా ఈ ఆనకట్టను డిజైన్ చేశారు. 2009నాటి వరదల్లో గరిష్టస్థాయికి మించి 890అడుగుల వద్ద గేట్ల స్థాయిని మించి వరదనీరు పొంగిపొర్లింది.శ్రీశైలం బ్యాక్ వాటర్ పోటుతో తుంగభద్ర నదికూడా ఉప్పొంగింది. మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాల్లో నది పరివాహక గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. కర్నూలు నగరంలో ఆనాటి వరద బీభత్సపు ఆనవాళ్లు చేదుజ్ణాపకాలుగా మిగిలే ఉన్నాయి.గేట్ల నుంచి 300మీటర్ల దిగువన నదిలోకి వరద ఉవ్వేత్తున ఎగిసి దూకటంతో ఆనకట్టుకు దిగువ భాగంలో నదిలో భారీ గొయ్యి ఏర్పడింది. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నిపుణుల బృందం శ్రీశైలం ప్రాజెక్టును నిశితంగా పరిశీలన చేసింది.

ప్రాజెక్టు 38గేట్ల మద్య నదిలో 45మీటర్ల లోతు , 270మీటర్ల వెడల్పు ,400మీటర్ల పోడవున గొయ్యి ఏర్పడినట్టు నివేదిక ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కృష్ణాబోర్డు అధికారుల కూడా ప్రాజెక్టను పరిశీలించారు. రిపేర్లకోసం రూ.190కోట్లు అవసరం అని కేంద్రానికి ప్రతిపాదించారు. శాశ్విత రిపేర్లకోసం డ్యాం రిహాబిలిటేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)కింద రూ.139కోట్లతో ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదిన కూడా పలు కొర్రీలతో వెనక్కు వచ్చింది. మరోమారు దీన్ని సవరించి రూ.190కోట్లతో ప్రతిపాదన పంపారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం కూడా ఇటీవల డ్యామ్‌ను పరిశీలించింది.శ్రీశైలం ప్రాజెక్టు పటిష్టతకోసం 19పనులనూ సూచించింది.ఈ మేరకు రూ.203కోట్లతో మరో ప్రతిపాదన పంపారు. స్పిల్‌వే, గేట్లు, దిగువన ప్లంజ్‌పూల్ గోయ్యి పూడ్చివేత , 2009లో దెబ్బతిన్న డ్యామ్ డౌన్‌స్ట్రీమ్ ఆప్రాన్ , రివర్స్ స్లూయీస్ గేట్ల రిపేర్, రిటైనింగ్ వాల్, అప్రోచ్ రోడ్,డ్యామ్ 12గేట్లకు రబ్బర్ సీళ్లు, తదితర వాటిని ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనలకు అటు కేంద్రం నుంచి గాని ఇటు తెలంగాణ , ఏపి ప్రభుత్వాల నుంచి గాని కనీస స్పందనలేదు . తక్షణ అవసరాలకోసం 64లక్షల కావాలని కోరినా ఏపి ప్రభుత్వం ఇప్పటిదాక పట్టించుకోలేదు. ఏదైనా జరగరానిది జరిగితే శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపులో మరోమారు కర్నూలు , మహబాబ్‌నగర్ జిల్లాలు జల విలయాన్ని చవిచూడాల్సివస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం ఎగువన ఉన్న ఈ జిల్లాలను కాపాడేందకు ప్రాజెక్టునుంచి ఒక్కసారిగా దిగువకు నీటిని విడుదల చేసినా ఒక్కసారిగా ప్రాజెక్టులో నిల్వ ఉండే 200టిఎంసీల నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటేత్తనుంది.

మొరాయిస్తున్న సాగర్ గేట్లు:
నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు చీటికి మాటికి మోరాయిస్తున్నాయి. కృష్ణానదిపైన అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న సాగర్‌లో మొత్తం 26గేట్లు ఉన్నాయి. అందులో గత ఏడాది ఆరుగేట్లు మోరాయించి చెమటలు పట్టించాయి. 2022 ఆగస్టు 11న సాగర్ నుంచి వరదనీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా ఒకటవ నెంబర్ గేటు మొరాయించింది. 5అడుగుల ఎత్తుకు చేరగానే ఎటూ కదలకుండా ఆగిపోయింది. మొత్తం 45అడుగుల ఎత్తుకు ఈ గేటును ఎత్తేందుకు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఆదే నెల 15న 26వ నెంబర్ గేటు ఎత్తేక్రమంలో మోటారుఫ్యాన్ విరిగిపోయింది. ఏ ప్రాజెక్టులోనైనా గేట్లు ఎత్తే క్రమంలో మధ్యలో మొరాయిస్తే రిజర్వాయర్‌లోని నీటి ప్రవాహ వత్తిడికి గేట్లు సులువుగా కొట్టుకుపోతాయని నిపుణలు హెచ్చరిస్తున్నారు. 2022అక్టోబర్‌లో నాగార్జున సాగర్ కుడికాలువ తొమ్మిదిగేట్లలో 9వ గేటు కొట్టుకుపోయింది.దీన్ని తిరిగి ఆమర్చటం సాద్యం కాకపోవటంతో ఆరు నెలలపాటు నీరంతా వృధాపోయింది.

జూరాల గేట్లు పటిష్టత గాలికి:
కృష్ణానదికి ముఖద్వారంగా 1995లో నిర్మించిన జూరాల ప్రాజెక్టు గేట్ల పటిష్టతను ప్రభుత్వం గాలికి వదిలేసింది.ఈ ప్రాజెక్టుకు మొత్తం 62గేట్లు ఉండగా , అందులో చెప్పగా చెప్పగా గత ఏడాది కిందట 7గేట్లను మాత్రమే పటిష్టపరిచారు. మిగిలిన గేట్ల పటిష్టత అలాగే మిగిలిపోయిందంటున్నారు.

కుంగిన మేడిగడ్డతో నిపుణలుకే సవాళ్లు :
ప్రపంచంలోనే అతిపెద్ద వరద ప్రవాహం కలిగిన గోదావరి నదిపై ప్రాజెక్టుల పరిస్థితికి ఇటీవల కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజి నీటిపారుదల రంగం నిపుణులకే సవాళ్లు విసురుతోంది. కేంద్రజలసంఘం, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ,జిఎస్‌ఐ తదితర పేరుమోసిన సంస్థలకు చెందిన నిపుణలును నెలల తరబడి తనచుట్టు తిప్పుకుంటున్న మేడిగడ్డ ఇప్పట్లో కోలుకుంటుందా అన్నది స్పష్టత లేకుండా పోయింది. 2006లో గోదావరి నదికి వచ్చిన 28.50లక్షల క్యూసెక్కుల వరద ప్రవావం 369గిరిజన గ్రామాలను ముంచెత్తింది. అంతకు ముందు 1986లో గోదావరి నది 36(ఒకేరోజులో 350టిఎంసిలు)లక్షల క్యూసెక్కల వరదను చవిచూసింది. గోదావరి నదిలో 50లక్షల నుంచి 60లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చేందుకు అవకాశాలు లేకపోలేదని ఇప్పటికే కేంద్ర జలసంఘం సూచించింది. ఇంతటి భారీ స్థాయిలో వరద ప్రవాహాలకు తట్టుకోగల ముందస్తు ప్రణాళికలు తెలుగు రాష్ట్రాల యంత్రాంగం వద్ద మచ్చుకైనా లేవంటున్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదలు పరివాహకంగా ఉన్న ప్రాజ్టెక్టుల భద్రతపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News