Wednesday, January 22, 2025

చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ…నిర్ణయం నేటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఎసిబి కోర్టులో సుదీర్ఘ వాదనలు పూర్తయ్యాయి. సిఐడి తరపున ప్రభుత్వ న్యాయవాది ఎఎజి పొన్నవోలు వాదనలు వినిపించగా చంద్రబాబు తరఫున వాదనలు సిద్ధార్థ లూథ్రా వినిపించారు. మూడు విడతల వాదనల అనంతరం ఎసిబి కోర్టు తీర్పు మంగళవారానికి వాయిదా వేసింది. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని ఎఎజి సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్న ఆయన జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రత కల్పించినట్లు తెలిపారు. జైలు లోపలా, బయటా పోలీసుల భద్రత ఉందన్నారు. పోలీసులు 24 గంటలూ డ్యూటీలో ఉన్నారని, అవసరమైతే వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉందని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జి భద్రతలో ఉన్నారన్న ఆయన చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉందన్నారు. హౌస్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లూథ్రా వివరించారు. గౌతం నవార్కర్ కేసును ఉదహరించారు. హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయన్నారు. చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిద్ధార్థ లూథ్రా కోరారు.

జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైల్లో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను, ఎసిబి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడంతో పాటు తగిన భద్రతనూ కల్పించాలన్నారు. ఇంటి నుంచి వచ్చిన ఔషధాలను, ఆహారాన్నీ అనుమతించండి అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు అంతకు ముందు పిటిషన్ దాఖలు చేశారు. ’మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు.. ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల జైల్లో సాధారణ బ్లాక్‌లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు అని, వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మందులు కూడా వాడాల్సి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు కాబట్టి ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఆయనకు హౌస్ అరెస్ట్‌ను అనుమతించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది.
చంద్రబాబుపై ఎసిబి కోర్టులో సీఐడీ రెండు పిటిషన్లు
తెలుగుదేశం అధినేత చంద్రబాబును కస్టడీకి కోరుతూ విజయవాడ ఎసిబి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి సిఐడి అధికారులు కోరారు. చంద్రబాబుపై మరో పిటిషన్‌నూ సిఐడి దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది.
సిఆర్‌పిసిలో హౌస్ రిమాండ్ అనేదే లేదు
ఆయన కేసును ప్రభావితం చేస్తారు : చంద్రబాబు పిటిషన్‌పై సిఐడి కౌంటర్
విజయవాడ ఎసిబి కోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. అందులో హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలన్న చంద్రబాబు పిటిషన్‌ను సిఐడి వ్యతిరేకించింది. సిఆర్‌పిసిలో హౌస్ రిమాండ్ అనేదే లేదని తెలిపింది. హౌస్ అరెస్ట్ అడుగుతున్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదని పేర్కొంది. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించింది. చంద్రబాబును హౌస్ అరెస్ట్‌కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం జైలులోనే చంద్ర బాబుకు అన్నివసతులు కల్పించామని పేర్కొంది. మరో రెండు కేసుల్లో కూడా చంద్రబాబు నిందితుడిగా ఉన్నారన్నారు. ఇక, సిఐడి తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ స్కామ్‌పై చంద్రబాబు నుంచి సిఐడి ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. చంద్రబాబును ఐదు రోజుల సిఐడి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని చెప్పారు. చంద్రబాబు తరఫున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదన్నారు. భద్రతా పరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచి చోటు వేరే ఉండదన్నారు.

Chandra Babu 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News