తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజుల క్రితం అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన మాటలు. జర్నలిస్టు అంటే ఎవరు? ‘జర్నలిస్టు’ అనే పదానికి డెఫినేషన్ ఇవ్వండి? అంటూ అన్నారు. తప్పుడు రాతలు రాస్తే కఠిన చర్యలు ఉంటాయి అని కూడా హెచ్చరించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. వాస్తవానికి పౌర పాత్రికేయ కుంటుపడుతుందా? జర్నలిజం దారి తప్పిందా! అసలు జర్నలిజం ముసుగులో ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయా? అసలు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మాధ్యమాలు ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందిస్తున్నాయా? ఇవన్నీ ప్రతి ఒక్క కామన్ మాన్ ఆలోచన చేయాల్సిన విషయం అని చెప్పొచ్చు.
ప్రింట్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర మీడియాకు ఉండదు. ఎంత డిజిటల్ జర్నలిజం వచ్చినా ప్రింట్‌కు ఉండే ప్రాధాన్యత ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పాలి! అసలు గతంలో పౌర పాత్రికేయ వృత్తిలో ఎందరో ప్రముఖ జర్నలిస్టులు పని చేశారు.వార్త సేకరణలో చాలా కష్టపడే వారు. ఒక వార్త వచ్చిందంటే ఒక్కోసారి రాష్ట్రంలో అతలాకుతలం అయ్యే సంచలన వార్తలు ప్రింట్ చేసే వారు. నేడు ఆ పరిస్థితి లేదు, కొన్ని వందల పత్రికలు డిజిటల్ జర్నలిజం రూపాల్లో వచ్చాయి! ఆ వార్త నిజమా, అబద్ధ్దమా అనే సందిగ్ధంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి అధిక పత్రికలు, డిజిటల్ జర్నలిజం రావటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు! అయితే నేడు డిజిటల్ జర్నలిజంలో ఎన్ని పత్రికలు రావటం వల్ల ఎందరో పుట్టగొడుగుల్లా విలేకరులు పెరిగిపోతున్నారు! కనీసం వార్త రచన రాని వారు కూడా జర్నలిస్టులు అయిపోతున్నారు.
వార్త రచన అనేది చాలా క్లిష్టమైన పని! వార్త రచనలో విలువలు లేకుండా, పదాల పొందిక లేకుండా, ఇంకో నూతన రచన ప్రక్రియను డిజిటల్ జర్నలిజంలో మనం చూడవచ్చు. మనం గమనిస్తే ప్రధాన పత్రికలు వాడే రచన, డిజిటల్ వార్త రచనకు చాలా తేడాలు ఉంటాయి. మారుతున్న కాలంతో పాటు ఈ మధ్య కాలంలో ఫేక్ జర్నలిస్టు కార్డ్ ద్వారా కొన్ని రకాల దందాలు, పైరవీలు వంటివి చేయించుకోవడానికి వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నిజానికి నిజమైన జర్నలిస్టు విలువలు పాటిస్తూ, వార్త రచనలో గాని, సేకరణలో గాని తనకు ఎటువంటి లాభం లేకుండా, అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తారు. ఈ విధంగా పౌర పాత్రికేయ వృత్తి కుంటుపడుతుందని నొక్కి చెప్పొచ్చు.
ప్రస్తుతం డిజిటల్ రంగం బాగా పెరిగింది. దానికి అనుగుణంగా డిజిటల్ జర్నలిజం కూడా పెరిగింది. నిజానికి డిజిటల్ రంగంలో వార్తలు ప్రజలకు నిమిషాల్లో వ్యవధిలో వెళ్ళడం జరుగుతుంది. ఉదయం రాసిన వార్త సాయంత్రం ఎడిషన్‌లో ప్రచురితం అవుతున్నది. గతంలో ప్రింట్ మీడియా అయితే మరుసటి రోజు వచ్చేది! పెరుగుతున్న డిజిటల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది అని చెప్పవచ్చు. అయితే తప్పుడు వార్త గానీ, జర్నలిజం పేరుతో వాక్ స్వాతంత్య్రం ఉంది అని చెప్పి ఇష్టారీతిన డిజిటల్ జర్నలిజం పేరుతో వాడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. నిజమైన జర్నలిస్టును గుర్తించాలి. వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి. నిజమైన జర్నలిస్టు లకు ఇళ్లు, ప్రభుత్వం నుండి అన్ని రకాల సేవలు అందించాలి. జర్నలిజం పేరుతో దూషించడం, తిట్టడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పౌర పాత్రికేయ వృత్తిను సరైన మార్గంలో తేవాలి. దీనికి అందరూ కృషి చేయాలి.