Monday, December 23, 2024

కొండచరియలతో ప్రాణగండం

- Advertisement -
- Advertisement -

నేపాల్‌లో శుక్రవారం (జులై 12) తెల్లవారు జామున కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయి మొత్తం 65 మంది ప్రయాణికులు కొట్టుకుపోయిన విషాద సంఘటన తెలిసిందే. ఏటా ఈశాన్య భారతంలో కొండచరియలు విరిగిపడడం గ్రామాలు నేలమట్టమై కొన్ని వందల మంది సమాధి కావడం, రోడ్లు విధ్వంసమై ప్రజాజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడడం కొనసాగుతోంది. ఈ ముప్పు నివారణకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలో అనేక నివేదికలు సూచిస్తున్నా ఆ మేరకు ప్రభుత్వ పరంగా సరైన ప్రయత్నాలు జరగడం లేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) ఈ కొండచరియల ప్రమాదాలపై 2020లో అధ్యయనం నిర్వహించింది.

దేశంలోని 16 రాష్ట్రాలు, హిమాలయ రీజియన్ లోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్యంలోని హిమాలయ పర్వత దిగువ భాగాలు, పశ్చిమ కనుమలు ఇవన్నీ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలుగా గుర్తించింది. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు, ఎలాంటి ప్రణాళిక లేకుండా సాగించే కొండల క్వారీ పనులు కొండచరియలు అమాంతంగా విరిగిపడడానికి కారణమవుతున్నాయని జిఎస్‌ఐ హెచ్చరించింది. అలాగే కొండచరియలు విరిగిపడడానికి 51% అనువైన ప్రాంతం ఉత్తరాఖండ్ అని వాడియా ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. ప్రపంచంలోనే భూకంపాలు సంభవించే ఆరోప్రాంతంగా ఈశాన్య ప్రాంతం ఉంటోంది. ఆరు నెలల పాటు ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొండచరియల ముప్పు తప్పించడానికి నిర్మాణాత్మక ఇంజినీరింగ్ పనులు చేపట్టడం అవసరమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచిస్తోంది.

నేల స్వభావం పరిశీలించకుండా, పోడు వ్యవసాయం వంటివి నివారించకుండా, కొండచరియల ముప్పును తప్పించే మార్గాలు అన్వేషించకుండా ఎలాంటి అభివృద్ధి నిర్మాణాలు చేపట్టినా ప్రమాదమేనని భౌగోళిక సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండానే 2015లో లంబ్డింగ్ సిల్చార్ బ్రాడ్‌గేజ్ రైల్వే నిర్మాణాన్ని చేపట్టారని పరిశోధకులు తప్పుపట్టుతున్నారు. ఈ రైల్వే నిర్మాణంలో 2022లో 58 చోట్ల గండ్లు పడ్డాయి. జిరిబాం ఇంఫాల్ సెక్షన్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి వాటిని నివారించడానికి, తగిన మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ‘నేషనల్ ల్యాండ్‌స్లైడ్ ససెప్టిబిలిటీ మేపింగ్’ ప్రక్రియను అమలు చేయవలసి ఉంటుందని జిఎస్‌ఐ సూచిస్తోంది.

హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాల తో అత్యధిక సంఖ్యలో చెట్లు కూల్చివేస్తున్నారు. 2015 నుంచి 2018 మధ్యకాలంలో 10.76 మిలియన్ చెట్లు కూలిపోయాయి. అరుణాచల్‌లోని భారీ డిబాంగ్ డ్యామ్ నిర్మాణం కోసం 2.7 లక్షల చెట్లను కూల్చివేశారు. డెహ్రాడూన్‌లో ప్రాజెక్టుల కోసం 11,000 చెట్లను కూల్చివేయడానికి ప్రభుత్వవర్గాలు సిద్ధం కాగా సుప్రీం కోర్టు అడ్డుచక్రం వేసి ఆపగలిగింది. కొండలను తొలిచి సొరంగాలు నిర్మిస్తున్నారు. దీంతో నేల దృఢత్వం దెబ్బతిని కొండచరియలు విరిగి జారిపడుతున్నాయి. వాటికి చేరువలో నివాసాలు ఉంటే అవి నేలమట్టమవుతున్నాయి. రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాల్లో 125 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికావరకు తుపాన్లు చెలరేగడానికి హిమాలయాల పర్యావరణానికి సంబంధం ఉందని ఇండో అమెరికా మాన్సూర్ స్టడీ వెల్లడించింది. హిమానీ నదాలు దశాబ్దానికి 30నుంచి 60 మీటర్ల వంతున దాదాపు 10,000 వరకు కుదించుకుపోతున్నాయి.

హిమాలయాల్లో ఎక్కువ భాగాన్ని ధ్వంసం చేసిన 2013 నాటి కేదార్‌నాథ్ విషాద సంఘటన నుంచి దేశం సరైన గుణపాఠం నేర్చుకోవడం లేదనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు లబోదిబోమనడం, ఎంతమేరకు నష్టం జరిగిందో మదింపు చేయడం తప్ప ఈ వైపరీత్యాలకు మూలకారణాలేమిటో వాటిని ఎలా నివారించగలమో అన్న ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం లేదు. ప్రకృతిపరంగా కొంత వైపరీత్యాలు జరుగుతుండగా, మానవ కల్పిత చర్యల వల్ల అంతకన్నా ఎక్కువగానే ప్రకృతికి నష్టం జరుగుతోంది. అలాంటి చర్యలను ప్రభుత్వాలు అడ్డుకోవడం లేదు.ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరిగే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం తన బడ్జెట్‌లో వైపరీత్యాల నివారణకు మూడోవంతు వెచ్చిస్తోంది.అయినా ఏం లాభం? సరైన ప్రణాళికలు అమలు కావడంలేదు. ముఖ్యంగా రహదార్ల నిర్మాణాల్లో నిబంధనలు పాటించడం లేదు.

వాహనాల రాకపోకలు, జనం రద్దీ, నిర్మాణాల విషయంలో సరైన అంచనా వేయాలని 2020 లోనే సుప్రీం కోర్టు నియామక కమిటీ సూచించింది. ఈమేరకు 13 హిమాలయ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. పర్వత శిఖరాల్లో ఉన్న పట్టణాలు, నగరాల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఆయా ప్రభావాలను అంచనా వేయాలని, అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఆయా రాష్ట్రాలకు గుర్తు చేసింది. పర్వత ప్రాంతాల్లో నేల క్షీణించి కోతకు గురవడం, జోషిమఠ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో విపరీత పరిణామాలు సంభవించడం చర్చనీయాంశం అవుతున్నాయి. సౌకర్యాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య నెలకొన్న సంక్లిష్టతపై చర్చలు కూడా జరుగుతున్నాయి. హిమాలయ రాష్ట్రాల్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు సౌకర్యాలు కల్పించడం క్లిష్టమైన సమస్య. అందుకనే ఈ రాష్ట్రాల్లో శాస్త్రీయ విశ్లేషణ అనుసరించి నిర్మాణాలు చేపట్టడం అవసరం. పర్యావరణ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలన్న ఆలోచనతో రవాణా సామర్థాన్ని మితిమీరి పెంచడం మంచిది కాదని పర్యావరణ నిపుణులు గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారు. అయినా నిబంధనలను త్రోసిరాజని రెండు వరసల రోడ్ల డిజైన్ ప్రకారం కొండల్లో రోడ్లను విస్తరించడం ప్రమాదాలకు దారి తీస్తోంది.

కె. యాదగిరి రెడ్డి
9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News