- జిల్లా కలెక్టర్ జి. రవినాయక్
మహబూబ్‌నగర్ బ్యూరో: శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు లే అవుట్‌తో సహ ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి జి. రవినాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ సమీపంలోని ధర్మాపూర్ వద్ద ఉన్న జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కలాశాలలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకై ఏర్పాట్లను పరిశీలించారు.
ఓట్ల లెక్కింపు చేపట్టే హళ్లు, అదే విధంగా ఈవిఎంలు భద్రపర్చే స్ట్రాంగ్ రూంల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వాళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బంది కౌటింగ్ కేంద్రాలకు వచ్చేందుకు విడివిడిగా దారులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు వచ్చేందుకు ప్రత్యేక దారులు ఏర్పాటు ఉండాలని, వీటితో పాఆటు మీడియా ప్రతినిధులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కవర్ చేసేందుకై ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని లే అవుట్‌ను రూపొందించి లే అవుట్‌తో సహ ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఆయన చెప్పారు. మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఒకే చోట నిర్వహిస్తున్నందున ఒక నియోజకవర్గానికి సంబంధించిన వారు ఇంకో నియోజకవర్గంలో కలవకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకదారులు, వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ , జడ్చర్ల రిటర్నింగ్ అధికారి ఎస్. మోహనరావు, మహబూబ్‌నగర్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ అనిల్ కుమార్ , దేవరకద్ర రిటర్నింగ్ అధికారి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ , ఇతర జిల్లా అధికారులు, సంబంధిత నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు తదితరులు ఉన్నారు.