Monday, December 23, 2024

ఎన్నికల ఓటరు జాబితా అభ్యంతరాలపై ప్రతిపాదనలు సమర్పించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: ఎన్నికల ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల మార్పు చేర్పులపై అభ్యంతరాలు ఉంటే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ పొలిటికల్ పార్టీ ప్రతినిధులను కోరారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సీతారామ రావుతో కలిసి పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో 2వ స్పెషల్ సమ్మరి రివిజన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ఎన్నికలు సమీపంలో ఉన్నందున ఇదే చివరి సమ్మరి రివిజన్ ఉంటుందని, అక్టోబర్ 1వ తేది నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అగుచున్న యువత ఇప్పుడే ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అవుతున్న ప్రతి యువత ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే విధంగా చూడాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. అదే విధంగా డబుల్ ఓటర్లు ఉన్నట్లు లేదా మరణించిన వారి పేర్లు తొలగించాల్సి ఉందని గమనిస్తే ఫారం 7 ద్వారా దరఖాస్తులు బిఎల్‌ఓలకు ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఆగష్టు 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ముసాయిదా జాబితాను పరిశీలించి అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సెప్టెంబర్ 19వ తేదిలోగా తీసుకోవడం జరుగుతుందన్నారు.

వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 28 లోగా పరిష్కరించి అక్టోబర్ 1న ఎన్నికల కమిషన్‌కు ఆమోదం కొరకు పంపించి అక్టోబర్ 4న తుది ఓటరు జాబితి విడుదల చేయడం జరుగుతుందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ నియోజకవర్గం 81లో 259 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అచ్చంపేట 82 నియోజకవర్గంలో 265 పోలింగ్ కేంద్రాలు, కొల్లాపూర్ 85వ నియోజకవర్గంలో 268 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. కొల్లాపూర్‌లో కొత్తగా మరో పోలింగ్ స్టేషన్‌కు ప్రతిపాదనలు వచ్చాయని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు లేదా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరం అని భావిస్తే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేసే సమావేశంలో ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు.

ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1300 ఓటర్లు కలిగి ఉంటారని, గత 6 నెలల నుంచి కొత్త ఓటర్లు ఎక్కడైనా పెరిగినట్లు గుర్తిస్తే ప్రతిపాదనలు పెట్టాలన్నారు. ప్రస్తుతం 1300 దాటినవి జిల్లాలో 6 పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగిందని, అందులో నాగర్‌కర్నూల్ 3, అచ్చంపేటలో 2, కొల్లాపూర్‌లో ఒకటి గుర్తించినట్లు తెలిపారు. 1300కు మించి కొత్తగా మరో 50 నుంచి 60 ఓటర్లు నమోదు అయితే అదనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు పొలిటికల్ పార్టీలు తమ పోలింగ్ బూత్ ఏజెంట్‌లను నియమించి వారి పేర్లు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామ రావు, ఆర్డీఓలు కె. వెంకట్ రెడ్డి, గోపి రామ్, నాగయ్య, పొలిటికల్ పార్టీ ప్రతినిధులు సిపిఐ నుంచి ఎం. శివ శంకర్, వైఎస్‌ఆర్ టిపి నుంచి మొహమ్మద్ హుస్సేన్, లక్ష్మయ్య, తెలుగుదేశం నుంచి బాలకృష్ణ, బాసప నుంచి సి. కళ్యాణ్, కాంగ్రెస్ నుంచి అర్థం రవి, బిఆర్‌ఎస్ నుంచి ఎన్. వెంకటయ్యు, బిజెపి నుంచి శ్రీ చందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News