లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శనివారం స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల వల్ల పాలన మెరుగు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘పిటిఐ వీడియోస్’తో ఇంటర్వూలో మేఘ్వాల్ మాట్లాడుతూ, మొదటి కొన్ని లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను 1952 నుంచి కలిపే నిర్వహించారని చెప్పారు. అవి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం కాకపోయి ఉంటే ‘ఇప్పుడు (ఫెడరల్ వ్యవస్థకు) ఎందుకు చేటు’ అని ఆయన ప్రశ్నించారు. సభా కమిటి ముసాయిదా చట్టాలను పరిశీలించాలనే ఆసక్తితో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నందున జమిలి ఎన్నికల బిల్లులను పార్లమెంట్ సంయుక్త కమిటీ (జెపిసి)కి నివేదించినట్లు మేఘ్వాల్ తెలియజేశారు.
సంయుక్త కమిటీ తొలి సమావేశంలో శాసన విభాగం కార్యదర్శి రాజీవ్ మణి జమిలి ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలను, ఆ ఎన్నికల చరిత్రను సభ్యులకు వివరించారని మంత్రి తెలిపారు. ‘ఇప్పుడు వారు (ఒక దేశం ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తున్నవారు) చేస్తున్న అతిపెద్ద ఆరోపణ ఏమిటంటే అవి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం అన్నది.1952 ఎన్నికలను నిర్వహించినప్పుడు అన్ని శాసనసభలకు ఎన్నికలను ఒకేమారు నిర్వహించారని నేను చెప్పదలిచాను. 1957 ఎన్నికలను, 1962 ఎన్నికలను ఒకే మారు నిర్వహించారు. 1967 ఎన్నికలను ఒకే మారు నిర్వహించారు& అవి ఏవిధంగా (ఫెడరల్ వ్యవస్థకు) చేటు?’ అని ఆయన అన్నారు. జమిలి ఎన్నికలు సుపరిపాలనకు, సత్వర అభివృద్ధికి దారి తీస్తాయని మేఘ్వాల్ చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఎప్పటికప్పుడు తలెత్తుతుండే ఇబ్బందులు పరిహారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికల వ్యవస్థ ఏమిటో జెపిసిలోని ప్రతిపక్ష సభ్యులకు వివరించినట్లు, వారు అర్థం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘లోక్‌సభ ‘నియుక్త తేదీ’ ఏమిటి అనేది కూడా వారితో చెప్పడమైంది, వారు ప్రతిదీ అర్థం చేసుకున్నారు’ అని మంత్రి తెలియజేశారు. ‘ఎవరో దానిని వ్యతిరేకిస్తుంటే వారు రాజకీయ కారణాలతోనే అలా చేస్తున్నారు’ అని మేఘ్వాల్ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, ఉభయ సభల సంయుక్త కమిటీ ముసాయిదా చట్టాలను పరిశీలిస్తున్నదని, సంప్రదింపులు సాగిస్తున్నదని చెప్పారు. ‘ఒక గ్రామంలో ఏదో ఒక ఆస్తి ఉన్నప్పుడు, ఒక రోజు మీరు వచ్చి అది వక్ఫ్ ఆస్తి అని, అది వక్ఫ్ ఆస్తి అవుతుందని అంటే ఎలా’ అని మేఘ్వాల్ అన్నారు. ఆక్రమణ విషయంలో ఒక విధానం ఉండాలని ఆయన సూచించారు. కమిటీ నివేదిక సమర్పించిన తరువాత అది పరిశీలనకు, ఆమోదముద్రకు పార్లమెంట్ ముందుకు వస్తుందని ఆయన చెప్పారు. ప్రార్థన మందిరాల చట్టం అంశంపై ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ, ఆ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నప్పుడు దానిపై వ్యాఖ్యానించడం చేయరాదు అని అన్నారు.