కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని దర్యాప్తు విభాగం వెల్లడి
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఇన్విస్టిగేషన్ వింగ్ వస్తు సేవల పన్నుపై నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రూ.5కోట్లకు మించి వస్తు సేవల పన్ను ఎగవేతదారులపై జీఎస్టీ అధికారులే నేరుగా విచారణ చేపట్టనున్నారని జీఎస్టీ దర్యాప్తు విభాగపు అధికారులు తెలిపారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 2017 ప్రకారం అధికారులు విచారణ ప్రారంభిస్తారన్నారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) దుర్వినియోగానికి పాల్పడినవారిపైన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు. అయితే తరుచుగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నవారిని దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన సందర్భంలో.. సీజీఎస్టీ చట్టం సెక్షన్ 132 ప్రకారం ఈ పరిమితి వర్తించబోదని తెలిపారు. విచారణ ప్రక్రియ చేపట్టేముందు పటిష్ఠ సాక్షాధారాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం ముఖ్యమని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలపై విచారణ చేపడితే మొత్తం కంపెనీ డైరెక్టర్లందరిపై చర్యలు తీసుకోకూడదు.
కంపెనీ వ్యవహారాలను నిత్యం పర్యవేక్షిస్తున్నవారు, పన్ను ఎగవేతలో ప్రధాన పాత్ర పోషించినవారిని విచారించవచ్చు. కాగా అధికారులు నేరుగా విచారణ చేపడితే వారే న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లుగా పరిగణించాల్సి ఉంటుంది. కాగా ఒక కంపెనీ లేదా పన్ను చెల్లింపుదారులెవరైనా గత రెండేళ్లలో రెండుసార్లు అంతకుమించి పన్ను ఎగవేతకు పాల్పడినా లేదా తప్పుడు పద్దతిలో ఐటీసీని క్లెయిమ్ చేసుకున్నా ఐటీసీ దుర్వినియోగానికి పాల్పడినవారిగా పరిగణిస్తారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నవారిని డిజిట్ డేటాబేస్ ద్వారా గుర్తించనున్నారు. దర్యాప్తు సమయంలో పన్ను ఎగవేతదారులను అరెస్టు చేసినప్పుడు బెయిల్ రాని సందర్భంలో 60రోజుల్లోగా ప్రాసిక్యూషన్ ఫిర్యాదు వివరాలను కోర్టులో సమర్పించాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. విచారణ చేపట్టేముందు ఆర్థిక నేర తీవ్రత, ఎగ్గొట్టిన పన్ను లేదా తప్పుగా క్లెయిమ్ చేసుకున్న రిఫండ్ విలువ వివరాలతోపాటు అధికారులు సేకరించిన సాక్షాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.