నార్మ్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్: భూసారాన్ని పరిరక్షిస్తూ, తగ్గిపోతున్న సహజ వనరులని సద్వినియోగం చేసుకుంటూ ఆహార, పౌష్టికాహార భద్రతలని సాధించడం ప్రస్తుతం అవసరం అని – ఐసిఏఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యాలు ఉత్పత్తి, ఉత్పాదకతల్లో ఎంతో పురోగతి సాధించినప్పటికీ దేశంలో ఇంకా సుమారు 20 శాతం మంది సరైన ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారని, ఎక్కువ శాతం చిన్నపిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మంగళవారం రాజేంద్రనగర్ లోని ఆడిటోరియంలో డాక్టర్ బి. రామమూర్తి 5వ స్మారకోపాన్యాస కార్యక్రమాన్ని నిర్వహించింది.
‘వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో నేలల యాజమాన్యం పాత్ర‘ అన్న అంశంపై శ్రీనివాసరావు రామమూర్తి 5వ స్మారకోపన్యాసం ఇచ్చారు. దేశంలో జనాభా పెరుగుతున్న కారణంగా సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. భూ, జలవనరుల లభ్యత, నాణ్యత రోజురోజుకీ తగ్గిపోతుందని వివరించారు. అంతేకాకుండా ఎరువుల అధిక వినియోగం వల్ల భూసార క్షీణతతో పాటు, పర్యావరణ కాలుష్యం అధికం అవుతుందని అన్నారు. వాతావరణ మార్పులు సమాజంపై తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నీటి వనరుల, సహజ వనరుల యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని అమలు చేయాలన్నారు. నేరుగా వెదజల్లే సాగు పద్ధతుల్ని అనుసరించాలన్నారు. సమర్థ నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణలకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
అదేవిధంగా దేశంలో 3వ వంతు ఆహారం వృధా అవుతుండడం దురదృష్టకరమని అన్నారు. ఈ వృధాని అరికట్టడానికి చర్యలు తీసుకోవలసిన అవసరముందన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ప్రాథమిక విద్యనుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. వెంకటరమణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి. రఘురామిరెడ్డి, రామమూర్తి కూతురు డాక్టర్ ఎస్. ఆదిలక్ష్మి, కుటుంబ సభ్యులు, శాస్త్రవేత్తలు, బోధన, బోధనేతర సిబ్బంది, విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతులు పాల్గొన్నారు.