Monday, January 20, 2025

మోర్బీ దోషులను రక్షించడం అమానుషం

- Advertisement -
- Advertisement -

వాంకనేర్ : గుజరాత్‌లో మోర్బీ తీగల వంతెన దుర్ఘటనకు బాధ్యులయిన వారిని కాపాడేందుకు పెద్ద పెట్టున యత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం విమర్శించారు. ఎన్నికలు జరిగే గుజరాత్‌లో ఆయన మోర్బీ జిల్లాలోని వాంకనేర్ పట్టణంలో త్రిరంగ యాత్ర పేరిట జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు. దోషులను కాపాడటంత బిజెపికి పరిపాటి అయిందని, ఇప్పుడు అత్యంత విషాదకరమైన ప్రాణనష్టం ఘటనలోనూ బిజెపి తరఫు అధికార యంత్రాంగం ఘటనకు బాధ్యులను కాపాడేందుకు శతవిధాలా యత్నిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. గత నెల 30వ తేదీన మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో 130 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన ఏ విధంగా జరిగిందనేది వేరే విషయం అయితే దీనికి బాధ్యులు అయిన వారిని రక్షించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరగడం దారుణం అని కేజ్రీవాల్ బిజెపిపై తమ దాడిని పెంచారు. తమ పార్టీ గుజరాత్‌లో అధికారంలోకి వస్తే భారీ స్థాయిలో మోర్బీ బ్రిడ్జిని కొత్తగా కట్టిస్తుందని ఆప్ తరఫున హామీ ఇచ్చారు. బిజెపి డబుల్ ఇంజిన్ తిరిగి రాష్ట్రంలో పట్టాలపైకి వస్తే ఇటువంటి దుర్ఘటనలు అనేకం జరుగుతాయని తెలిపారు.

మోర్బీలో జరిగిన విషాదం అత్యంత బాధాకరం, 55 మంది చిన్నారులు ప్రాణాలొదిలారు. ఇందులో ఇక్కడున్న వారి పిల్లలు కూడా ఉండి ఉంటారని, వారి ఆవేదన తనతో పాటు ఎందరో అర్థం చేసుకోగలరని, అయితే ఇప్పుడు మానవ విషాదాన్ని పక్కకుపెట్టి , కొందరు ఈ ఘటనకు బాధ్యులను కాపాడేందుకు యత్నిస్తున్నారని, ఇది అత్యంత విషాదకరం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మచ్చూ నదిలో పడి ఇంత మంది చనిపోతే ఇందుకు బాధ్యులైన వారిని ఏదో విధంగా రక్షించాలని అనుకుంటే అది ఎటువంటి సంకేతాలకు దారితీస్తుందని ప్రశ్నించారు. కొందరితో ఈ బాధ్యులకు ఉన్న తెరవెనుక సంబంధ బాంధవ్యాలు వీరిని రక్షిస్తున్నాయని ఆరోపించారు.

దుర్ఘటన జరిగిన బ్రిడ్జి పునరుద్ధరణ పనిని కాంట్రాక్టుకు తీసుకున్న ఒరెవా గ్రూప్ , ఈ సంస్థ ఓనర్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని తెలిపారు. దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. విషాద ఘటన జరిగినప్పుడు అందుకు బాధ్యులను తగు విధంగా శిక్షించేందుకు సరైన విచారణ అవసరం అయితే దీనిని గాలికి వదిలేస్తే తిరిగి ఇటువంటి ఘటనలు జరగవా? అని కేజ్రీవాల్ నిలదీశారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ పార్టీకి అత్యధిక సంఖ్యలో ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌లో పెద్దపెట్టున మార్పు తలెత్తిందని, ఈ విషయం ఈ ఎన్నికలలో తేటతెల్లం అవుతుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News