Sunday, April 20, 2025

పశ్చిమ బెంగాల్‌లో ఘటనలపై బంగ్లాదేశ్ వ్యాఖ్యలకు భారత్ ఖండన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశీ అధికారులు చేసిన వ్యాఖ్యలను భారత్ శుక్రవారం తోసిపుచ్చింది. ‘మాకు సూచనలు’ చేసే బదులు బంగ్లాదేశ్‌లోని మైనారిటీల హక్కుల పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించాలని ఢాకాను భారత్ కోరింది. ‘పశ్చిమ బెంగాల్‌లో ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్ పక్షం చేసిన వ్యాఖ్యలను మేము తిరస్కరిస్తున్నాం’ అని విదేశాంత మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ప్రకటించారు. ‘బంగ్లాదేశ్‌లో మైనారిటీల పై ప్రస్తుతం సాగుతున్న వేధింపులపై భారత్ ఆందోళనలతో సారూప్యం తెచ్చేందుకు ఇది తెలివిమీరిన యత్నం. బంగ్లాదేశ్‌లో అటువంటి చర్యల క్రిమినల్ బాధ్యులు యథేచ్ఛగా సంచరిస్తున్నారు’ అని జైశ్వాల్ పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని పరిణామాలపై బంగ్లాదేశీ అధికారులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా ప్రశ్నలకు జైశ్వాల్ ఆ విధంగా స్పందించారు. ‘అవాంఛిత వ్యాఖ్యలు చేయడానికి, హితోక్తులకు దిగడానికి బదులు బంగ్లాదేశ్ తమ సొంత మైనారిటీల హక్కుల పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించడం శ్రేయస్కరం’ అని ఆయన అన్నారు. ‘మైనారిటీ ముస్లిం జనాభాను పూర్తిగా రక్షించేందుకు అన్ని చర్యలూ’ తీసుకోవలసిందిగా న్యూఢిల్లీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ మీడియా కార్యదర్శి షఫీఖుల్ ఆలమ్ గురువారం విజ్ఞప్తి చేశారు. ‘ముస్లింలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తూ జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం’ అని ఆలమ్ అన్నారు. ‘మైనారిటీ ముస్లిం జనాభా పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవలసిందిగా భారత, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆలమ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News