9 లక్షలు సిసిటివిలతో నిఘా
ఎఫ్‌టిసిసిఐ సమావేశంలో మాట్లాడిన డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారని డిజిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసుశాఖ , ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టిసిసిఐ) సోమవారం నిర్వహించిన సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అన్ని పరిశ్రమలకు పోలీసులు సహకరించారని తెలిపారు. రాష్ట్ర పోలీసులు దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారన్నారు.
హైదరాబాద్ నగరం అత్యంత భద్రత కలిగి, నెక్ట్ జనరేషన్ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని, రాష్ట్ర పోలీసులు ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీసులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పౌరుడికి భద్రతను కల్పించాలని, ఇందులో ఎలాంటి భేదాబిప్రాయాలు చూపించవద్దని ఆదేశించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతమైన నిఘా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 9లక్షల సిసిటివిలను అమర్చామని, హైదరాబాద్ నగరంలో 7లక్షల ఇన్‌స్టాల్ చేశామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, వర్చువల్ రియాల్టీ, డేటా అనలిటిక్స్ వాడుతున్నామని తెలిపారు.
టెక్నాలజీ సాయంతో సంచలనం సృష్టించిన కేసులను 24గంటల్లోను ఛేదించామని తెలిపారు. పరిశ్రమలతో కలిసి పోలీసులు పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం ఎఫ్‌టిసిసిఐ అధ్యక్షులు కె. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో పోలీస్‌శాఖ అధికారులు, సిబ్బంది సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివన్నారు. రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంతో పాటు ఉద్యోగుల భద్రతకు అన్ని వేళలా పోలీసులు భరోసా కల్పించారన్నారు. పరిశ్రమలకు, వ్యాపారాలకు ఏలాంటి అడ్డంకులు లేకుండా వ్యాపార కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో పోలీసు శాఖ పూర్తి సహాయాన్ని అందించిందన్నారు. రాచకొండ సిపి మహేళ్‌భగవత్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో పోలీసులు ధైర్యంగా విధులు నిర్వర్తించారన్నారు. అదేవిధంగా కోవిడ్ సంక్షోభంలో వివిధ పరిశ్రమలలో పనులు చేస్తున్న వలస కార్మికులను ఆదుకోవడంలో వివిధ సంస్థల వారు ముందుకొచ్చారన్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం మా కమాండ్ సెంటర్‌తో అన్ని పరిశ్రమలను అనుసంధానించడానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్తమ పోలీసులుగా గుర్తింపు పొందిన రాష్ట్ర పోలీసు శాఖ విధులు నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. అత్యాధునీక సాంకేతిక పరిజానంతో రాష్ట్ర పోలీసు శాఖ ముందుకు సాగుతోందన్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ పరిశ్రమలు,వ్యాపారాలకు అనువుగా ఉన్న హైదరాబాద్‌లో భద్రత కల్పించడంలో పోలీసు శాఖ అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. పోలీసు శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ దేశంలో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.