డీఎన్‌ఏ లోని ఏకైక చిన్నమోలిక్యూల్‌ను ఉపయోగించి టీబీ బ్యాక్టీరియా లోని ఏకైక ప్రొటీన్ హప్ బి (హెచ్ యు పి బి)ని అడ్డుకోవడంలో పరిశోధకులు కొంతవరకు విజయం సాధించారు. మనిషి కణం లోకి బ్యాక్టీరియా ప్రవేశించకుండా 55 శాతం వరకు బ్యాక్టీరియా సామర్థాన్ని తగ్గించ గలిగారు. హప్‌బీ ప్రొటీన్‌ను 1990లో ప్రొఫెసర్ హెచ్. క్రిష్ణప్రసాద్ కనుగొన్నారు. టీబీ బ్యాక్టీరియా లోని హానికరమైన పదార్థం మానవుల్లో ప్రతిఘటన చర్యను ప్రేరేపించడాన్ని గుర్తించారు. ఆ ప్రొటీన్ బ్యాక్టీరియాకు చెందిన డిఎన్‌ఎతో కలియడాన్ని కనుగొన్నారు. డిఎన్‌ఎతో ఇది కలసి ఉన్నప్పటికీ బ్యాక్టీరియా పైభాగంపై ఇది ఉంటుందని అనుకోలేదు.
కానీ తమకు ఆశ్చర్యం కలిగించేలా ఇది టీబీ బ్యాక్టీరియా ఉపరితలంపై కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు. హప్ బీ ప్రొటీన్ ఆశ్రయ కణాలపై ఉన్న ప్రొటీన్లతో కలిసి అడ్డుకొంటుందని తరువాతి అధ్యయనాల్లో వెల్లడైంది. అదే ఆశ్రయ కణాల్లోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తోంది. హప్‌బీ అన్నది టిబి బ్యాక్టీరియాకు ముఖ్యమైన ప్రొటీన్. అందువల్ల ఔషధాన్ని ఆకర్షించే లక్షంగా ఉంటుందని అంటున్నారు. హప్ బీకి వ్యతిరేకంగా నిరోధకాల రూపకల్పనలో వైఫల్యం ఎదురైనప్పటికీ డిఎన్‌ఎ మోలిక్యూల్ ఆప్టమెర్స్ అందుబాటు లోకి రావడంతో ప్రొటీన్ ఆకృతి అవసరం లేకుండా పోయింది.
రెండు రకాల డిఎన్‌ఎ లైబ్రరీల నుంచి పరిశోధకులు 23 ఆప్టమర్స్‌ను ఎంపిక చేయగా, అందులో ఈ 23 లో కేవలం 4 టి, 13 టి అనే రెండు ఆప్టమర్స్ చివరకు ఎంపిక అయ్యాయి. ఈ ఆప్టమర్స్ ప్రమేయంతో ఆశ్రయ కణాల్లోకి చొరబడే బ్యాక్టీరియా శక్తి తగ్గిపోయింది. ప్రపంచ జనాభాలో నాలుగోవంతు మంది క్షయ పీడితులుగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 2035 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్షంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేస్తోంది. ప్రారంభదశ లోనే దీన్ని గుర్తించ లేక పోతే చివరకు ప్రాణాంతకమౌతుంది. ముఖ్యంగా పేద దేశాల్లో ఈ వ్యాధిని గుర్తించడం, సరైన వైద్య చికిత్స అందించడం అంతగా జరగడం లేదు. ఏటా పది మిలియన్ కన్నా ఎక్కువ మందికి ఇది వ్యాపించి వారిలో రెండు మిలియన్ మందిని చంపుతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.