Sunday, December 22, 2024

ఇది బిజెపి, కాంగ్రెస్ ల కుట్ర

- Advertisement -
- Advertisement -

నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

కవిత అరెస్టు అక్రమం,అప్రజాస్వామికం,అనైతికం
ఆమె అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం
అంతా ప్రణాళిక ప్రకారమే రాజకీయ దురుద్దేశంతోనే కవితను అరెస్టు చేశారు
ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్
అరెస్టులు, వేధింపులు, కుట్రలు మాకు కొత్త కాదు
ఇలాంటివి ఎన్నో ఛేదించి తెలంగాణ రాష్ట్రం సాధించాం
కవితను అరెస్టు చేస్తారని గతంలో బిజెపి నేతలు చెప్పారు
బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సి కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. కవిత అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది. ఎంఎల్‌సి కవిత అరెస్టు నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంఎల్‌సి కవిత అరెస్టు అక్రమం,అప్రజాస్వామికం,అనైతికమని వ్యాఖ్యానించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు అని కక్షతో కావాలనే శుక్రవారం రోజు కవితను పథకం ప్రకారం అరెస్ట్ చేశారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత అరెస్టును తీవ్రంగా హరీశ్‌రావు ఖండిస్తుంచారు. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం రాజకీయ కుట్రే అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రంలో కలిసి కుట్ర చేశాయని అన్నారు. ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఈడీకి అంత తొందర ఎందుకు అని ప్రశ్నించారు. మహిళలను ఇడి అరెస్టు చేయొచ్చా..? చేయొద్దా..? అనే అంశం కోర్టులో ఉందని, మమతా బెనర్జీ కుటుంబ సభ్యురాలి పైన, నలిని చిదంబరం పైన, కవితపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్నదని తెలిపారు. ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే, మూడు రోజుల ముందే అరెస్టు చేయడం అంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీసే కుట్ర అని అర్థమవుతున్నదని అన్నారు.
బిజెపి రాజకీయంగా కక్ష సాధింపులకు దిగుతోంది.

బిఆర్‌ఎస్‌పై బిజెపి రాజకీయంగా కక్ష సాధింపులకు దిగుతోందని హరీశ్‌రావు విమర్శించారు. కవిత అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ మనోధైర్యం దెబ్బతీయాలని బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి రాజకీయ కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తమను ఏ రకంగానైనా డీమోరలైజ్ చేసి ఏ విధంగానైనా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందాలని బిజెపి, కాంగ్రెస్ కలిసి ఈ రాష్ట్రంలో కుట్రపన్నుతున్నాయని అన్నారు. ఇడి అధికారులు కవితను అరెస్టు చేస్తారని గత సంవత్సరన్నర కాలంగా బిజెపి నాయకులు, బిజెపి కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. శనివారం పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందని ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చిందని, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిసి శుక్రవారం కవితను అరెస్టు చేయడం అంటే ఇది తమ పార్టీని, కెసిఆర్‌ను డీమోరలైజ్ చేసే ఒక ప్రయత్నమే అని ఆరోపించారు. బిజెపి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అంతా ప్రణాళిక ప్రకారమే రాజకీయ దురుద్దేశంతోనే కవితను అరెస్టు చేశారని అన్నారు. ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్ అని, ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏళ్లు పోరాటం చేశామని అన్నారు. అరెస్టులు, వేధింపులు, కుట్రలు తమకు కొత్తేమి కాదని, ఇలాంటిని ఎన్నో ఛేదించి తెలంగాణ రాష్ట్రం సాధించామని చెప్పారు.
కవిత అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా కవితను అరెస్టు చేశారని హరీశ్‌ రావు అన్నారు. కవిత అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇడికి సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా రాజకీయ దురుద్దేశంతోనే శుక్రవారం కవితను అరెస్ట్ చేశారని అన్నారు. బిజెపి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల కుమ్మక్కు కవిత అరెస్టుతో అర్ధం అయ్యిందని చెప్పారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓటమి తప్పదని అన్నారు. ఇడి ముందు సెర్చ్ అని, ఆ తర్వాత అరెస్టు అన్నారని పేర్కొన్నారు. ముందే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని పథకం ప్రకారమే కవితను అరెస్ట్ చేశారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను బిజెపి జేబు సంస్థలుగా మార్చుకుంది: జగదీశ్‌ రెడ్డి
కవిత అరెస్టును రాజకీయ కుట్రకోణంలో చూస్తున్నామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇడి అధికారులకు కవిత
అన్నీ ఆధారాలు ఇవ్వడంతో పాటు పూర్తిగా సహకరించారని తెలిపారు. ఢిల్లీ నుండి వచ్చినప్పుడే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని వచ్చారని పేర్కొన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుందని ఆరోపించారు. పి.ఎల్.ఎం.ఎ యాక్ట్‌లో మహిళలకు మినహాయింపు ఉండాలని అన్నారు. రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసుకోవడానికి బిజెపి కుట్రలు చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇవ్వడం…వారు బిజెపిలో చేరగానే కేసులు లేకుండా చేశారని విమర్శించారు. బిజెపికి కెసిఆర్ లొంగలేదు కాబట్టి కవితను అరెస్టు చేశారని పేర్కొన్నారు.
కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపితం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపితమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఈ చర్యలు అనైతికమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విపక్ష పార్టీలు లక్ష్యంగా చేసే ఈ చర్యలు ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. కెసిఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పస్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసమే కవితను అరెస్టు చేశారని అన్నారు. ఈ పరిణామాలు వారికి తాత్కాలిక ఆనందమే అని, భవిష్యత్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
రాజకీయ కక్షతోనే కవిత అరెస్టు: ఎంపీ రవిచంద్ర
బిఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు, ఎంఎల్‌సి కవిత అరెస్టు అక్రమం అని ఎంపి వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఇడి సోదాలపేరుతో అరెస్టు చేయడం తెలంగాణ ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. రాజకీయ సీరియల్ తలపించేలా ఇన్నిరోజులు విచారణ పేరుతో అయోమయానికి గురిచేసిన ఇడి తీరా లోకసభ ఎన్నికలకు ముందు అకారణంగా అరెస్టు చేయడం రాజకీయ కక్షల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై చట్టసభల్లో, న్యాయస్థానాల్లో పోరాడుతామని అన్నారు.

Harish Rao 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News