Thursday, January 23, 2025

గుడిలో ఖురాన్ పఠనంపై నిరసన: బేలూరులో ఉద్రిక్తత (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కర్నాటకలోని హసన్ జిల్లా బేలూరు పట్టణంలో ఉన్న చారిత్రాత్మక చెన్నకేశవ స్వామి దేవాలయ రథోత్సవంలో ఖురాన్ పఠనం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్, ఇతర హిందూత్వ సంస్థలకు చెందిన కార్యకర్తలు మంగళవారం నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఏప్రిల్ 4వ తేదీన జరగనున్న చెన్నకేశవ రథోత్సవంలో ఖురాన్‌ను ముస్లిం మత పెద్దలు పఠించడం అనేక దశాబ్దాలుగా సాంప్రదాయంగా వస్తోంది.

అయితే.. హిందూ ఆలయానికి చెందిన ఉత్సవాలలో ఖురాన్ పఠనాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని నిలిపివేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ బేలూరు పట్టణంలో మంగళశారం బంద్‌కు హిందూ సంస్థలు పిలుపుఇచ్చాయి. బంద్ సందర్భంగా ఒక ముస్లిం యువకుడు ఖురాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ యువకుడిని చుట్టుముట్టి అతడిని ప్రశ్నించారు. ఆ యువకుడు కూడా హిందూత్వ కార్యకర్తలతో వాదనకు దిగడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఆ యువకుడిని అక్కడి నుంచి నిరసనకారులు తరిమివేశారు. ఈలోగా మరో గ్రూపునకు చెందిన నిరసనకారులు రోడ్డును అడ్డగించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఆ ముస్లిం యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

చెన్నకేశవ రథోత్సవంలో ఖురాన్ పఠనం నిలిపివేయాలని కోరుతూ హిందూత్వ కార్యకర్తలు తహసిల్దార్ కార్యాలయంలో ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఏప్రిల్ 3వ తేదీలోగా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని వారు కోరారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెన్నకేశవ రథోత్సవం మతం రంగు పలుముకోవడం పట్ల జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది.

12వ శతాబ్దానికి చెందిన బేలూరు చెన్నకేశవ ఆలయ కట్టడం ఒక అద్భుతమనే చెప్పాలి. దీని నిర్మాణం పూర్తి కావడానికి 103 సంవత్సరాలు పట్టింది. మూడు తరాలకు చెందిన రాజుల కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. అత్యంత పురాతన ఆలయాలలో ఒకటైన చెన్నకేశవ ఆలయానికి వారసత్వ కట్టడం గుర్తింపు త్వరలో యునెస్కో నుంచి దక్కే అవకాశం ఉంది.

గత ఏడాది హిదూత్వ శక్తుల నిరసనల మధ్యనే ఆలయ రథోత్సవాల సందర్భంగా ఖురాన్ పఠనం జరిగింది. ఈ ఆలయంలో ఖురాన్ పఠనం 1932లో ప్రారంభమైందే తప్ప అంతకుముందు నుంచి ఈ సాంప్రదాయం లేదని హిందూత్వ సంస్థలు వాదిస్తున్నాయి. కాగా..మసీదులు, దర్గాలలో వేద మంత్రాలు పఠించడానికి అనుమతిస్తారా అని హిందూత్వ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

బేలూరు చెన్నకేశవస్వామి రథోత్సవం రెండు రోజులపాటు జగరనున్నది. మైసూరు రాజులు బహూకరించిన బజ్రవైఢూర్యాలు పొదిగిన కిరీటాన్ని ధరించి చెన్నకేశవస్వామి విగ్రహం రథంపై ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా సాగుతుంది. ఈ రథోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు ఏటా తిలకిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News