వయనాడ్: మనిషికి, మృగానికి మధ్య జరుగుతున్న యుద్ధానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని కోరుతూ అధికార ఎల్‌డిఎఫ్, ప్రతిపక్ష యుడిఎఫ్, బిజెపి ఇచ్చిన జిల్లా వ్యాప్త బంద్ శనివారం కేరళలోని వయనాడ్ జిల్లాలో హింసాత్మకంగా మరింది. పూల్‌పల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖకు చెందిన వాహనాన్ని ధ్వంసం చేసిన స్థానికులు పులి దాడిలో చనిపోయిన ఆవు కళేబరాన్ని వాహనం బానెట్‌కు కట్టేసి తమ నిరసన తెలిపారు. వయనాడ్ జిల్లాలో తరచు మనుషులపై జంతువులు దాడి చేస్తుండడంతో ఈ సమస్యకు పిరష్కారాన్ని కనుగొనడానికి మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ఆదేశించారు.
పూల్‌పల్లి గ్రామస్తులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లను అడ్డగించడంతోపాటు అటవీ శాఖకు చెందిన వాహనాన్ని ధ్వంసం చేశారు. జీపు టాపును చింపివేయడంతోపాటు టైర్లను పంక్చర్ చేశారు. కురువ ద్వీపం సమీపంలో శుక్రవారం ఒక అడవి ఏనుగు దాడిలో మరణించిన అటవీ శాఖకు చెందిన ఎకో టూరిజం గైడు పాల్ మృతదేహంతో పూల్‌పల్లి వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తులను అటవీ అధికారులు కాపాడలేకపోతున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు అటవీ శాఖ వాహనంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. వయనాడ్ జిల్లా వ్యాప్తంగా శనివారం దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.