Monday, March 17, 2025

వక్ఫ్ బిల్లుపై ఎఐఎంపిఎల్‌బి నిరసన

- Advertisement -
- Advertisement -

వక్ఫ్ (సవరణ) బిల్లుపై ఢిల్లీలో నిరసన ధర్నాకు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) సోమవారం ఆధ్వర్యం వహించింది. పలువురు ఎంపిలు ధర్నాలో పాల్గొన్నారు. బిల్లుకు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జెడి (యు), ఎల్‌జెపి(రామ్‌విలాస్) మద్దతు ఇచ్చినట్లయితే ముస్లింలు ఆ పార్టీలను ఎన్నటికీ క్షమించబోరని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వాటిని హెచ్చరించారు. ఎఐఎంపిఎల్‌బి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ప్రదర్శనలో పలు ముస్లిం సంస్థలు పాల్గొన్నాయి. నిరసన ప్రదర్శన స్థలంలో ఒబైసీ ప్రసంగిస్తూ, దేశంలో శాంతిని చెడగొట్టే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. ‘మందిర్ మసీదు అంశంపై ప్రజలు పోరాడుతుండాలనేదే ప్రధాని ఉద్దేశం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బిల్లు ధ్యేయం కాదు’ అని ఆయన అన్నారు., ‘ముస్లింల మసీదులు, దర్గాలు, శ్మశానవాటికలను స్వాధీనం చేసుకోవడానికి బిల్లు ప్రయత్నిస్తోంది.

మీరు ఈ కీలక సమయంలో బిల్లును సమర్థించినట్లయితే, మీ మద్దతులో బిల్లు ఆమోదముద్ర పొందిన కారణంగా ఈ ప్రపంచం ఉన్నంత కాలం ముస్లింలు మిమ్మల్ని క్షమించబోరని (టిడిపి చీఫ్) చంద్రబాబు నాయుడు, (ఎల్‌జెపి రామ్‌విలాస్ చీఫ్ చిరాగ్) పాశ్వాన్ సాహబ్, (జెడియు చీఫ్) నితీశ్ కుమార్‌లను హెచ్చరిస్తున్నాం’ అని ఒవైసీ చెప్పారు. ‘ఈ రాజ్యాంగవిరుద్ధ బిల్లును సమర్థించవద్దు’ అని ఆయన కోరారు. ముస్లిమేతరులను వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో భాగం చేయడాన్ని బిల్లు అనుమతిస్తుందని, ఇతర మతాల మందిరాల యాజమాన్యంలో ఆయా మతాలకుచెందినవారిని మాత్రమే సభ్యులను చేస్తున్నారని కూడా ఒవైసీ పేర్కొన్నారు. ‘ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధమైన, ముస్లింవ్యతిరేక చర్య తీసుకుంటున్నది’ అని ఒవైసీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నిరసన ప్రదేశంలో విలేకరులతో మాట్లాడుతూ, బిల్లు రాజ్యాంగబద్ధమైనది కాదని, దానితో ప్రజలు సంతృప్తి చెందలేదని చెప్పారు. బిల్లు ఏకైక ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల కైవసమే అని షియా పెద్ద కల్బె జవద్ ఆరోపించారు.

‘ఇతర మతాలవారు తమ సంస్థలపై అనుభవించే హక్కులనే ముస్లింలకు వక్ఫ్ మంజూరు చేస్తుంటుంది. ప్రతి మత విశ్వాసంలోనివారికి వారి వ్యవహారాల పాలనాధికారం ఉండగా ముస్లింలను ఎందుకు వేరు చేస్తున్నారు’ అని జమాతే ఇస్లామి హింద్, ఎఐఎంపిఎల్‌బి ఉపాధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుసేనీ అన్నారు. అవధేశ్ ప్రసాద్ (ఎస్‌పి), సయ్యద్ నసీర్‌హుస్సేన్ (కాంగ్రెస్) సహా పలు ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ధర్నాను ఈ నెల 13న నిర్వహించాలని తొలుత సంకల్పించారు. కానీ హోలీ కారణంగా సెలవుల దృష్టా వాయిదా వేశారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ నడుమ ఈ నిరసన ధర్నా చోటు చేసుకున్నది. ప్రతిపాదిత శాసనంపై తన నివేదికను పార్లమెంట్ సంయుక్త కమిటీ (జెపిసి) సమర్పించడంతో వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగలిగారు. పలు సమావేశాలు, విచారణల అనంతరం 31 మంది సభ్యుల జెపిసి ప్రతిపాదిత శాసనానికి పలు సవరణలు సూచించింది.మరొకవైపు ప్రతిపక్ష సభ్యులు నివేదికను వ్యతిరేకించి, అసమ్మతి పత్రాలు అందజేశారు.

కమిటీ తన 655 పేజీల నివేదికను జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా అందజేసింది. అధికార బిజెపి నుంచి సభ్యులు సూచించిన మార్పులతో నివేదికను కమిటీ 1511 మెజారిటీ వోటుతో ఆమోదించింది. వక్ఫ్ బోర్డులను నాశనం చేసే యత్నంగా బిల్లును ప్రతిపక్షం ఆక్షేపించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన తరువాత దానిని ఆగస్టు 8న జెపిసికి నివేదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News