కొచ్చి: కేరళలో అనేక యువ సంస్థలు శుక్రవారం ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కొచ్చి థియేటర్ల ముందు నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్(ఎన్‌వైసి) కార్యకర్తలు స్థానిక థియేటర్ల ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. సినిమాను నిషేధించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సినిమాలో కేరళను తక్కువ చేసి చూపారని వారు ఆరోపించారు. సినిమా అంతా అవాస్తవంతో నిండిందని, అది సంఘ్‌పరివార్ విచ్ఛిన్నకర ఎజెండాలో భాగంగా తీసిందని ఆరోపించారు.
థియేటర్ల ఎదురుగా రోడ్లపై కూర్చుని వారు సినిమాకు, నిర్మాతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్ల మీది నుంచి దూకి ముందుకుపోడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ‘అనేక మతాలు, సముదాయాలు కలిసిమెలిసి జీవిస్తున్న రాష్ట్రం కేరళ. ఉత్తర భారత్‌లో వలే వారు ఇక్కడ కూడా మతచిచ్చు రేకెత్తించి ప్రజలను విభజించాలని చూస్తున్నారు’ అని ముస్లిం సంస్థ నాయకుడొకరు అన్నారు. ఎన్‌వైసి సంస్థ ఇలాంటి నిరసననే కొజికోడ్‌లో కూడా చేపట్టింది.