Sunday, April 13, 2025

పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకంగా ‘వక్ఫ్’ ఆందోళన

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో వక్ఫ్ బిల్లుపై జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిమ్టిటా స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. వారు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పది మంది పోలీసులు గాయపడ్డారు. దీనితో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బిఎస్‌ఎఫ్ సిబ్బందిని మోహరించవలసి వచ్చింది. ఈ ఘటనతో రెండు రైళ్లను రద్దు చేశారు. మరిఐదు రైళ్లను దారి మళ్లించారు. ఈ దాడిలో కొందరు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. మరొక వైపు ముర్షిదాబాద్‌లోను పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు వాహనాలను తగులబెట్టి విధ్వంసం సృష్టించారు.

ఈ హింసాత్మక ఘటనలపై గవర్నర్ సివి ఆనంద్ బోస్ తీవ్రంగా స్పందించారు. హింసకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడారు. కాగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు కారకుల అరెస్టుకు పోలీసులు దాడులు ప్రారంభించారు. సిఎం మమతా బెనర్జీ ఈ నెల 16న ఇమాముమలతో కోల్‌కతాలో సమావేశం కానున్న నేపథ్యంలో ఆందోళనకారులు శాంతించాలని టిఎంసి నేత కునాల్ ఘోష్ కోరారు. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ మంగళవారం ముర్షిదాబాద్‌లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. అప్పటి నుంచి రోజూ ఆందోళనలు సాగుతుండగా శుక్రవారం అవి హింసాత్మకంగా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News