Thursday, December 26, 2024

సంభల్ మసీదు సర్వేపై నిరసన హింసాత్మకం

- Advertisement -
- Advertisement -

సంభల్‌లో మొఘలుల కాలం నాటి మసీదుపై కోర్టు ఆదేశిత సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారుడు ఆదివారం భద్రత సిబ్బందితో సంఘర్షణకు దిగగా ముగ్గురు వ్యక్తులు హతులయ్యారు. నిరసనకారులు వాహనాల దగ్ధానికి ప్రయత్నించి, పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారుల మూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, బ్యాటన్లు ప్రయోగించారు. ‘దుండగులు తుపాకులు కాల్చార. కొన్ని తూటాలు మా పోలీస్ సిబ్బందికి తగిలాయి. కాల్పులు ఎక్కడి నుంచి, ముఖ్యంగా దీప సరాయ్ ప్రాంతం నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నాం’ అని ఒక అధికారి చెప్పారు. ‘నయీమ్, బిలాల్, నౌమన్ అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌పి) గన్నర్ సహా పోలీస్ సిబ్బంది కొంత మంది కూడా గాయపడ్డారు’ అని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ఆదివారం ఉదయం సర్వే బృందం షాహి జమా మసీదులో తమ పని మొదలు పెట్టగా మసీదు సమీపంలో సమీకృతమైన అనేక మంది ప్రజలు నినాదాలు చేయనారంభించినప్పుడు కల్లోలం రేగింది.

జమా మసీదు ప్రాంతంలో హరిహర్ ఆలయం ఉండేదని పేర్కొంటున్న ఒక పిటిషన్‌ను పురస్కరించుకుని ఒక స్థానిక కోర్టు మసీదు సర్వేకు మంగళవారం ఆదేశించినప్పటి నుంచి సంభల్‌లో ఉద్రిక్త పరిస్థితి సాగుతోంది. పది మంది వ్యక్తులను నిర్బంధించినట్లు, దర్యాప్తు ప్రారంభించినట్లు ఒక అధికారి తెలియజేశారు. కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కొన్ని మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించారని ఆయన తెలిపారు. దౌర్జన్య కాండల పాల్గొన్న నిందితులపై కఠినతర జాతీయ భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద కేసులు పెట్టనున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఇది ఇలా ఉండగా, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తాజా ఘటనలకు సంబంధించి బిజెపిపై విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల్లో అక్రమాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు’ అధికార పార్టీ, ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ దౌర్జన్యకాండను రేకెత్తించాయని అఖిలేశ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News