శ్రీలంక అధ్యక్షుడి భవనంలో నోట్ల కట్టలు!
లెక్కపెట్టి అధికారులకు అప్పగించిన నిరసనకారులు
గొటబాయ నివాసాన్ని పిక్నిక్ స్పాట్‌గా మార్చుకున్న ఆందోళనకారులు
వంటా వార్పుతోపాటు బెడ్రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్‌లో సరదాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
బుధవారం రాజీనామా చేస్తానని స్పీకర్‌కు సమాచారమిచ్చిన గొటబాయ
కొలంబో: శ్రీలంకలో ప్రభుత్వంపై ఆగ్రహంతో శనివారం అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఇంకా అక్కడే ఉన్నారు. భవననాన్ని టూరిస్టు స్పాట్‌గా మార్చుకున్న నిరసనకారులు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. కొందరు వంటా వార్పూ చేసుకుంటే మరికొందరు అధ్యక్షుడి బెడ్‌రూమ్‌లలోకి చొరబడి అక్కడి బెడ్‌పై విశ్రాంతి తీసుకున్నారు. మరికొందరు జిమ్‌లో వ్యాయామం చేస్తే, ఇంకొందరు స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ సరదాగా గడిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా ఇదంతా తెలుస్తోంది. మరో వైపు అధ్యక్ష భవనంలో కోట్ల విలువైన నోట్ల కట్టలను ఆందోళనకారులు గుర్తించినట్లు ‘డైలీ మిర్రర్’. అనే పత్రిక పేర్కొంది. వాటిని లెక్కించి పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు నోట్లు లెక్కిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏమిటో తెలుసుకొని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
గొటబాయ ఎక్కడున్నారు?
మరోవైపు ఆందోళనకారుల ముట్టడిని ముందుగానే పసిగట్టిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారమే అధ్యక్ష భవనంనుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ తలదాచుకున్నారనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంక్షోభ సమయంలో ఆయనకు ఎవరు ఆశ్రయం కల్పించి ఉంటారనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన దేశం విడిచి వెళ్లి ఉంటారనే వాదనలూ వినిపిస్తున్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయంలో హడావుడిగా భారీ ఎత్తున లగేజి, విఐపి కాన్వాయ్ చేరుకోవడానికి సంబంధించిన వీడియోలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.దీంతో ఆయన దేశం విడిచి వెళ్లి ఉంటారనే అంచనాకు వస్తున్నారు. ఆయన కనపడకుండా పోయినప్పటినుంచి స్పీకర్‌కు రాజీనామా చేస్తానని తెలియజేయడం తప్ప మరో ప్రకటన ఏదీ బైటికి రాలేదు.
బుధవారం రాజీనామా చేస్తానని అధ్యక్షుడు తనకు తెలియజేశారని స్పీకర్ మహింద యాప అబెయవర్ద్దె్దన శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. ఆయన బాధ్యతలనుంచి దిగిపోయిన తర్వాత శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రధాని విక్రమ్ సింఘె అధ్యక్ష బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. కేబినెట్‌లో ఒకరు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలి. అయితే విక్రమ్ సింఘె కూడా బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తదుపరి అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు అధ్యక్ష బాధ్యతల్లో స్పీకర్ కొనసాగుతారు. అధ్యక్షుడు రాజీనామా సమర్పించిన మూడు రోజుల్లోగా పార్లమెంటు సమావేశమై కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రాంభించాల్సి ఉంటుంది. నెలలోగా కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలి. కాగా దేశంలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో, కార్మిక, విదేశీ ఉపాధి శాఖ మంత్రి మనుష ననయక్కర ప్రకటించారు.
ఆర్మీ చీఫ్ ప్రకటన
ఇదిలా ఉండగా, దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని, అందువల్ల దేశంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు, సైన్యానికి ప్రజలు సహకరించాలని శ్రీలంక త్రిదళాధిపతి(సిడిఎస్) జనరల్ శవేంద్ర సిల్వా కోరారు.దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో కలిసి సిల్వా ఈ ప్రకటన చేశారు.
Protester swim in Sri Lanka President Bhavan’s Swimming Pool