Wednesday, January 22, 2025

కోనసీమలో నిరసనాగ్ని

- Advertisement -
- Advertisement -

జిల్లా పేరుపై అమలాపురంలో ఎగసిన హింసాయుత నిరసన

మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు
ముమ్మిడివరం ఎంఎల్‌ఎ ఇంటికి కూడా నిప్పు, మంత్రి, ఎంఎల్‌ఎ కుటుంబ సభ్యులను సురక్షితంగా తరలించిన పోలీసులు
ఎస్‌పి వాహనంపై రాళ్ల దాడి
20మంది పోలీసులకు గాయాలు
మూడు ఆర్‌టిసి బస్సులు, పోలీసు వాహనాలు దగ్ధం
ఆందోళనకారుల దాడిలో స్పృ హ తప్పిన డిఎస్‌పి, తృటిలో ప్రమాదం తప్పించుకున్న ఎస్‌పి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన కారులు అమలాపురంలో మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈక్రమంలో అమలాపురంలోని బ్యాంక్ కాలనీలోని మంత్రి విశ్వరూప్‌కు చెందిన ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు ఆయన ఇంట్లో వున్న కాన్వాయ్ వాహనాలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. అదేవిధంగా కామనగరువులోని మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయంపైనా దాడులకు దిగిన ఆందోళనకారులు కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే మంత్రి విశ్వరూప్ ఇంటి సమీపంలో మూడు ఆర్‌టిసి బస్సులను ధ్వంసం చేశారు. నిరసన కారులు ముమ్మడివరం వైఎస్సాఆర్ సిపి ఎంఎల్‌ఎ పొన్నాడ సతీశ్‌కు చెందిన ఇంటిని సైతం తగులబెట్టారు. కాగా దాడికి ముందే మంత్రి, ఎంఎల్‌ఎ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. మంత్రి ఇళ్లకు నిప్పుపెట్టిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో పాటు అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. అలాగే నిరసన కారులను అడ్డుకునేందుకు 25 చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారిగా జెఎసి నేతృత్వంలో ఆందోళనకారులు గడియారం స్థంభం నుండి వరకు ర్యాలీని ప్రారంభించారు. అయితే ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఎస్‌పి సుబ్బారెడ్డి తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే అక్కడే ఉన్న డిఎస్‌పి , గన్ మెన్లు గాయపడ్డారు. ఆందోళన కారుల దాడిలో డిఎస్‌పి స్పృహ తప్పారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి లాఠీచార్జీ చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా చితకబాది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా ఆందోళనకారులను తరలించేందుకు తీసుకు వచ్చిన రెండు వాహనాలతో పాటు ఒక బస్సును నిరసనకారులు దగ్దం చేశారు. ఆందోళనకారుల దాడిలో డిఎస్‌పితో పాటు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జీలో కూడా పలువురు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

ఘటన దురదృష్టకరం ః మంత్రి విశ్వరూప్

ఆందోళన కారులు తన ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణమని టిడిపి, జనసేన, బిజెపిలు డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ పేరు పెట్టామని విశ్వరూప్ తెలిపారు. ఇప్పుడు ఆ పార్టీలు మాట మార్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాని ఆరోపించారు.అందరినీ వేడుకుంటున్నానని మీ అభ్యంతరాలు పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదని ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలన్నారు. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలని మంత్రి విశ్వరూప్ కోరారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలపై ఎపి హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. అంబేద్కర్ పేరు వ్యతిరేకించడం సరికాదని ఆమె హితవు పలికారు. కోనసీమ ఆందోళన వెనుక టిడిపి, జనసేన పార్టీలు వున్నాయని హోంమంత్రి ఆరోపించారు.

కోనసీమ ముద్దు.. వేరే పేరు వద్దు ః

కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్ వద్ద జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ’కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ వందలాది యువకులు నినాదాలు చేశారు. అమలాపురంలో ఆందోళనకారులను పోలీసులు వెంబడించారు. కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని యువకులు కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు.అమలాపురం ఆస్పత్రి వద్ద పోలీసు జీపుపై, పోలీసులపై ఆందోళనకారుడు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను తరలిస్తున్న రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. అమలాపురంలో ఎస్‌పి సుబ్బారెడ్డి క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహించారు. నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన నిరసనకారులను పోలీసులు నిలువరించారు.

వినతుల మేరకే పేరు పెట్టాం ః సజ్జల

కోనసీమ ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతులు వచ్చామని, విస్తృతంగా డిమాండ్ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయన్నారు అంబేడ్కర్ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ అని దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఇది జరిగింది ః

కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో కోనసీమ జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేపట్టారు. యువత, జెఎసి నేతలు పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేయడంతో పాటు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. వాటిని అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం నాడు అమలాపురంలోని కలెక్టరేట్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆందోళన కారులపై చర్యలు ః డిఐజి పాలరాజు

అమలాపురంలోని పరిస్థితిని డిఐజి పాలరాజు సమీక్షించారు. ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారని, దాడులకు పాల్పడిన ఆందోళనకారులపై చర్యలు ఉంటాయన్నారు. సిసిఫుటేజ్ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత హింసకు పాల్పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని డిఐజి పాలరాజు సూచించారు.

ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలి ః పవన్ కల్యాణ్

అమలాపురం ఘటనను ముక్త కంఠంతో ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News