ఆందోళనకారులపై పెల్లెట్లు, పెప్పర్ బాల్స్ ప్రయోగం
మెల్‌బోర్న్: లాక్‌డౌన్ నిబంధనలకు నిరసనగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో రెండోరోజూ ఆందోళనలు తీవ్రరూపంలో సాగాయి. విధ్వంసానికి పాల్పడుతున్న నిరసనకారులపైకి పోలీసులు పెప్పర్‌బాల్స్, రబ్బర్‌బుల్లెట్లు ప్రయోగించి చెదరగొట్టారు. పోలీసులపైకి రాళ్లు, బాటిళ్లులాంటివి విసురుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసుల వాహనాలపైనా దాడుల దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. దాదాపు 2000మంది ఈ నిరసనలో పాల్గొనగా, 60మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు అధికారులు గాయపడ్డారు. మెల్‌బోర్న్‌లో రెండు వారాలపాటు నిర్మాణ పనులను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. సోమవారం నుంచే ఆందోళనలు ఉధృతరూపం తీసుకున్నాయి. ఈ వారాంతానికల్లా కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని నిర్మాణ కార్మికులకు నిబంధన విధించారు. కార్మికుల రాకపోకల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతున్నదని అధికారులు చెబుతున్నారు.