Friday, November 22, 2024

మయన్మార్‌లో నిరసనల హోరు

- Advertisement -
- Advertisement -

మయన్మార్‌లో నిరసనల హోరు.. అణచివేతలకు ప్రతిఘటనలు

Protests Continue in Myanmar after more than 100 killed

యాంగూన్: ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రాణప్రదం అంటూ మయన్మార్‌లో ఆదివారం తిరిగి నిరసనకారులు రోడ్లపైకి తరలివచ్చారు. మయన్మార్‌లో సైనిక దినోత్సవం నాడే(శనివారం) సైన్యం పలుచోట్ల ఉద్యమకారులపై జరిపిన కాల్పుల్లో వంద మందికి పైగా మృతి చెందారు. మరుసటి రోజు ప్రజాస్వామ్య ఉద్యమకారులు పలు చోట్ల ప్రదర్శనలకు దిగారు. దేశంలో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొనాలని, సైనిక పాలనకు చరమగీతం పాడాలని వీధులలోకి వచ్చి నినదించారు. పలు చోట్ల ఒక్కరోజు క్రితం జరిగిన కాల్పుల ఘటనల ఆనవాళ్లు ఆరకముందే ఉదయం నుంచే ప్రజలు నిరసనలకు దిగుతూ వచ్చారు. దీంతో యాంగూన్, మండలలేలలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ యధావిధిగా భద్రతా బలగాలు ఉద్యమకారులను అణచివేసేందుకు మునుపటిలాగానే బలప్రదర్శనకు దిగారని వార్తా సంస్థలు తెలిపాయి. శనివారం ఒక్కరోజే దేశంలో వివిధ ప్రాంతాలలో ఉద్యమకారులపై సైనికుల కాల్పుల్లో 114 మంది వరకూ కన్నుమూశారు. ఆంగ్ సాన్ సూకి నాయకత్వపు ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. అప్పటి నుంచి పలు ప్రాంతాలలో సైనిక రాజ్యానికి వ్యతిరేకంగా నిరసన ఉధృతమవుతూ వచ్చింది.
సైనిక చర్యలపై అంతర్జాతీయ ఖండనలు
ప్రజలపై సైన్యం కాల్పులు జరిపిన ఘటనలపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. మయన్మార్‌లోని దౌత్య కార్యాలయాల నుంచి విదేశాలలోని అధికారిక కార్యాలయాల నుంచి ఖండనలు వెలువరిస్తూ ప్రకటనలు హోరెత్తుతున్నాయి. పౌరులను ఈ విధంగా చంపివేయడం దారుణమని,ఇదితనకు దిగ్భ్రాంతి కల్గించిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వ్యాఖ్యానించారు. పెద్దలు చివరికి పిల్లలపై కూడా తూటాలు ప్రయోగించారని, ఇది నెత్తుటి భీభత్సం అని స్పందించారు. ఈ విధమైన సైనిక జులుం అరాచకరీతిలో సాగుతూ ఉండటం ఆమోదయోగ్యం కాదని, దీనిని నివారించాల్సి ఉందని తెలిపారు. స్థిరమైన అంతర్జాతీయ స్థాయి ధృఢచిత్తంతో వ్యవహరించి , అంతర్జాతీయ సమాజం స్పందనతో దీనిని అడ్డుకోవల్సి ఉందని పిలుపు నిచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ప్రకటన వెలువరిస్తూ బర్మా సైనికులు సాగించిన రక్తపాతం దారుణమని ఖండించారు. ఇది గగుర్పాటు కల్గించిందన్నారు. కొందరి కోసం అక్కడి జుంటా వందలాది మంది నిరాయుధ సామాన్యుల ప్రాణాలను బలితీసుకొంటోందని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.

మరో వైపు 12 దేశాలకు చెందిన సైనిక ప్రధానాధికారులు వేర్వేరుగా ఖండన ప్రకటనలు వెలువరించారు. నిరాయుధ ప్రజలపై ఈ విధంగా కాల్పులకు తెగబడటం దారుణమని, భావ్యం కాదని తెలిపారు. ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, జర్మనీ,గ్రీస్, ఇటలీ, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా ఆర్మీ చీఫ్‌ల నుంచి ఖండన ప్రకటనలు వెలువడ్డాయి. అంతర్జాతీయ సమాజం మయన్మార్ ఘటనలపై స్పందించడం లేదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ అధికార బలంతో పెత్తనం సాగిస్తూ దమననీతిని ప్రదర్శిస్తూ ఉంటే, ప్రపంచదేశాలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. మయన్మార్‌లో హింసాకాండను భద్రతా మండలి ఖండించింది. అయితే జుంటాకు వ్యతిరేకంగా నిర్ఠిష్ట చర్యలేవీ ప్రతిపాదించలేదు. చైనా, రష్యాల నుంచి మయన్మార్ సైన్యానికి భారీగా ఆయుధ సాయం అందుతోంది, సైనిక పాలకులపైనే ఈ రెండు దేశాలు రాజకీయంగా పరోక్ష మద్దతు వ్యక్తం చేశాయి. ఈ దశలో భద్రతా మండలి నుంచి మయన్మార్ సంబంధిత చర్యలు ప్రతిపాదితం అయితే వాటిపై ఈ రెండు దేశాలు వీటోకు దిగుతాయని భావిస్తున్నారు.
అవన్నీ ఘర్షణలు దొమ్మి చర్యలే: సైన్యం
ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో దేశంలో కొందరు అరాచక చర్యలకు పాల్పడుతున్నారని మయన్మార్ సైన్యం ఎదురుదాడికి దిగింది. పౌరులను కాపాడటం తమ విధి అని, అయితే ప్రదర్శనలు శృతి మించితే వాటిని ఘర్షణకు దారులుగా భావించి తగు విధంగా నియంత్రించాల్సి ఉంటుందని జుంటా స్పష్టం చేసింది. నిరసనకారులు మోలోటోవ్ కాక్‌టైల్స్ వాడటం, శనివారం కొన్ని చోట్ల నిరసనకారులు విల్లుంబులు, గునపాలు కటార్లు పట్టుకుని ఉండటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. దొమ్మిలకు, అతిక్రమణలకు దిగేవారిని నిలువరించడాన్ని తాము ఈ విధంగా బల వినియోగంతోనే అణచివేసి తీరుతామని సైనిక వర్గాలు ప్రకటించాయి.

Protests Continue in Myanmar after more than 100 killed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News