హెచ్‌సియు పక్కన ఉన్న కంచ గచ్చిబౌలి భూములపై బిజెపి మంగళవారం నాడు తీవ్రస్థాయిలో విరుచుపడింది. ఈ భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాలని ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, భపేంద్ర యాదవ్‌లకు రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ఎంపిలు వినతిపత్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సిఎం రేవంత్‌కు స్వయంగా లేఖ రాసి పర్యావరణ పరిరక్షణకు కమిటీ వేయాలని కోరారు. రాజ్యసభలో లక్ష్మణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
హెచ్‌సియు భూములపై ధర్నాలు ఎక్కడికక్కడ
అడ్డుకున్న పోలీసులు బిఆర్‌ఎస్, బిజెవైఎం,
వామపక్ష కార్యకర్తల అరెస్టు బిజెపి
ఎమ్మెల్యేలను నిర్బంధించిన పోలీసులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఆందోళనలతో నగరం అట్టుడికిపోయింది. హెచ్‌సియూ ముట్టడికి బిజేవైఎం, బిఆర్‌ఎస్ పిలుపు ఇవ్వడంతో పోలీసులను భారీగా మోహరించారు. హెచ్‌సియూకు వెళ్తన్న వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారు. బిజేపి నాయకుడు చీకోటి ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. హెచ్‌సియూకు ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసుల ను భారీ ఎత్తున మోహరించారు. మాదాపూర్ డిసిపి వినీ త్, ఎసిపి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్‌సియూ విద్యార్థులు బయటికి రాకుండా పో లీసులు గేట్లు మూసి వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీలో ఆందోళన చేశారు. మరోవైపు బిజేవైఎం కార్యకర్తలు యూనివర్సిటీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొందరు బిజేవైఎం కార్యకర్తలను గచ్చిబౌలి, మాదాపూర్ పోలీసులు ముందుగానే హౌస్ అ రెస్టు చేశారు. ఇలా అరెస్టు చేసిన వారిని నార్సింగి, గచ్చిబౌలి, మాదాపూర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బిజేవై ఎం, ఎబివిపి, వామపక్షాల నాయకులు యూనివర్సిటీలోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదర్‌గూడ వద్ద ఉద్రిక్తత
హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బిజేపి ఎమ్మెల్యేలు హెచ్‌సియూ భూముల వద్దకు బయలుదేరి, బాధిత విద్యార్థులు, హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. హెచ్‌సియూ వద్దకు వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్ట ర్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తర్వాత బిజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హెచ్‌సియూ భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు హెచ్‌సియూలో మంగళవారం తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి.
హెచ్‌సియూ భూముల వేలంను అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.పరిస్థితి అదుపుతప్పడంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూముల వేలంపై ప్లకార్డులతో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఇంచు భూమి కూడా వదులుకోమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
బిఆర్‌ఎస్ నాయకుల హౌస్ అరెస్టు
బిఆర్‌ఎస్ నాయకులు హెచ్‌సియూకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కెటిఆర్, మిగతా ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి వారు రాకుండా బిఆర్‌ఎస్ నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బిఆర్‌ఎస్ విద్యార్థి నాయకులు హెచ్‌సియూ వద్ద ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కెపిహెచ్‌బి, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి హెచ్‌సియూకు వస్తున్న బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.