చింద్వారా : ఉగ్రవాదుల దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ (ఐఎఎఫ్ ) సైనికుడు కార్పొరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారా లోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఐఎఎఫ్ కాన్వాయ్‌పై జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లో శనివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ మరణించారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విక్కీ సోదరి గీతా పహాడే మీడియాతో మాట్లాడుతూ “ నా సోదరుడిని చూసి గర్వపడుతున్నా. శనివార సాయంత్రం 6.30 గంటలకు అతడు ఉగ్రదాడిలో గాయపడ్డాడని మాకు సమాచారం వచ్చింది. అనంతరం నా సోదరుడు వీరమరణం పొందాడని తెలిసింది. అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
గీతాపహాడే భర్త మాట్లాడుతూ “ వారి కుటుంబంలో విక్కీ ఒక్కగా నొక్క కుమారుడు. అతడి మరణంతో ఐదేళ్ల కుమారుడు తండ్రి లేని వాడయ్యాడు. అయినా విక్కీ దేశం కోసం ప్రాణాలివ్వడం మాకు గర్వకారణం” అని కన్నీటి పర్యంతమయ్యారు. విక్కీ పహాడేకు భారత వైమానిక దళం ఆదివారం సంతాపం తెలిపింది. పూంచ్ ప్రాంతంలో వైమానిక దళం కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు సైనికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయాలు పాలైన విక్కీ చికిత్స పొందుతూ మరణించారు.