న్యూఢిల్లీ : పాకిస్థాన్ వెళ్లని భారతీయ ముస్లిం అదృష్టవంతుల్లో తానొకడిగా గర్వపడుతున్నానని రాజ్యసభ విపక్ష కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం పేర్కొన్నారు. భారత్ భూతల స్వర్గంగా తాను భావిస్తుంటానని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత తాను జన్మించానని, ఇప్పటివరకు పాకిస్థాన్ వెళ్లని అదృష్ట వంతుల్లో తానొకడినని అన్నారు. పాకిస్థాన్ లోని పరిస్థితుల గురించి చదివినప్పుడు, హిందుస్థానీ ముస్లింగా తాను గర్వపడతానని చెప్పారు. రాజ్యసభ సభ్యునిగా వీడ్కోలు కానున్న సందర్భంగా ఆయన ప్రసంగించారు.
తాను కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 లో ఉగ్రవాదుల దాడి జరిగిందని, ఆ విపత్తు నుంచి గట్టెక్కడానికి భగవంతుణ్ణి ప్రార్థించానని చెప్పారు. జమ్ముకశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు సాగిన తన రాజకీయ ప్రస్థానాన్ని తలచుకుంటూ సభలో ప్రతిష్ఠంభన ఎలా తొలగించాలి, సభను ఎలా జరపాలి అన్నది మాజీ ప్రధాని వాజ్‌పేయ్ దగ్గరే నేర్చుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. తన పదవీ విరమణ సందర్భంగా ప్రధాని మోడి చేసిన ప్రశంసాపూర్వక ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. సభలో తన వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదని, వ్యక్తిగతాన్ని, రాజకీయాలను మోడీ ఎప్పుడు వేర్వేరుగా చూస్తారని పేర్కొన్నారు.