చికిత్సలో జాప్యం చేయొద్దు
ఒప్పంద ఆసుపత్రులకు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ సూచన
ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
హైదరాబాద్: కార్పొరేట్ వైద్యం కోసం వచ్చే సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఒప్పంద ఆసుపత్రుల (ఎంప్యానెల్ హాస్పిటల్స్) యాజమాన్యాలకు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ విజ్ఞప్తి చేశారు. సింగరేణితో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రుల యాజమాన్యాలతో సింగరేణి భవన్‌లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సింగరేణి కార్మికులకు ఒప్పంద ఆసుపత్రుల్లో కొన్ని సందర్భాల్లో వైద్య సేవలు అందడంలో జాప్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ విశ్రాంత కార్మికులకు జారీ చేసిన మెడికల్ కార్డులపై నగదు రహిత చికిత్స అందించాలని ఆయన ఆస్పత్రుల యాజమాన్యాలకు సూచించారు. కరోనా సమయంలో సింగరేణి కార్మికులు దాదాపుగా అన్ని ఆసుపత్రులు సహకారం అందించాయని, ప్రస్తుతం మరింత మెరుగ్గా సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అసౌకర్యానికి గురి కాకుండా చూసుకోవాలి: కె.సూర్యనారాయణ
జనరల్ మేనేజర్ కో ఆర్డినేషన్ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత కార్మికులు దూర ప్రాంతాల నుంచి కార్పొరేట్ వైద్యం కోసం వస్తున్నారని, అలాంటి వారు అసౌకర్యానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒప్పంద ఆసుపత్రులపై ఉందన్నారు. ఆసుపత్రుల ప్రతినిధుల కాంటాక్టు నెంబర్లను తమకు అందజేస్తే సింగరేణి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, తద్వారా కార్మికులు ముందస్తుగా ఫోన్ చేసి వచ్చేందుకు వెసులుబాటు ఉంటుందని, దీంతో ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.
కంపెనీ సూచించిన నమూనాలో బిల్లులను సమర్పించాలి: మంథా శ్రీనివాస్
బిల్లులను త్వరగా మంజూరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఆసుపత్రుల ప్రతినిధులు కోరగా దీనిపై స్పందించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంథా శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీ సూచించిన నమూనాలో బిల్లులను సమర్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం లేకుండా మంజూరు చేస్తామన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తమతో నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవచ్చన్నారు. కార్మికులకు మాత్రం ఇబ్బందులు కలగకుండా చూడాల న్నారు. ఈ సమావేశంలో ఎజిఎం (ఫైనాన్స్) రాజేశ్వర్ రావు, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య, ఒప్పంద ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.