ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆర్.కృష్ణయ్య లేఖ
అన్ని జిల్లాల్లో, విశ్వవిద్యాయాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందేవారికి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలని వినతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో పోటీ పరీక్షలకు హాజరై అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం ఒకే దఫాలో 80 వేల పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు పోటీ పరీక్షలు రాయడానికి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వసూలు చేస్తున్నాయి. వివిధ పోటీ పరీక్షలకు హాజరై అభ్యర్థుల నుంచి ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లో వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులు ఈ కోచింగ్ తీసుకునేందుకు అద్దె రూమ్ తీసుకోవడం, భోజనం ఖర్చులు మరో 30 వేల నుంచి 40 వేల ఖర్చు వస్తుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కోచింగ్ తీసుకోవడం సాధ్యం కాదు.
ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అభ్యర్థులకు పెద్ద ఎత్తున కోచింగ్ ఇచ్చేలా స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో పోటీ పరీక్షల కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ పోటీ పరీక్షలలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వరకు పోటీ పడే వీలుందన్నారు. ఇంత పెద్దమొత్తంలో అభ్యర్థులు అభ్యర్థులకు ప్రభుత్వ స్టడీ సర్కిల్ లో కోచింగ్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇందుకోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకునే అభ్యర్థులకు కోసం ప్రభుత్వమే ఫీజు రియంబర్స్‌మెంట్ – స్టే ఫండ్ ఇవ్వాలని కోరారు. పోటీ పరీక్షల కోసం అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.