ఈ ఆర్థిక సంవత్సరంలోఅనుకున్న లక్ష్యాలకు మించి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. నిర్దేశించుకున్న లక్షం రూ.20 వేల కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.22 వేల కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పించామని చెప్పారు. పుస్తకాల్లో ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందరో ఉంటారని, కానీ ఆచరణలో, కుటుంబ నిర్వహణలో మహిళలే అత్యున్నత ఆర్థికవేత్తలుగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ప్రాంగణంలో ‘మహిళా సాధికారత కార్యాచరణ ప్రణాళిక’ అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిఇఓ దివ్యా దేవరాజన్, సెర్ప్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, ఏపిఎంలు పాల్గొన్నారు.
మహిళా ప్రగతికి చిహ్నంగా మొక్కలకు నీరు పోసి వర్క్ షాప్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచిందని గుర్తు చేశారు. మహిళల కష్టానికి తగిన ఫలితం దక్కినప్పుడే నిజమైన మహిళా దినోత్సవమని పేర్కొన్నారు. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగిన వివక్షత కొనసాగుతూనే ఉందని అన్నారు. మహిళలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్‌లు అయినా లైంగిక అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు మహిళలకు వ్యవసాయం, పరిశ్రమలు మాత్రమే ఉపాధి మార్గాలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. మహిళలకు అనుకూలంగా అత్యుత్తమ విధానాన్ని రూపొందించేందుకు త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అనుభవజ్ఞులంతా సలహాలు సూచనలు చేస్తే, దానికి అనుగుణంగా నూతన విధానాన్ని రూపొందిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. లింగ సమానత్వాన్ని సాధించడంలో మహిళా సంఘాల పాత్ర గణనీయంగా ఉందన్నారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. త్వరలో మరిన్ని వ్యాపారాల్లోకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని అన్నారు.