మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో సోమవారం నాటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణ నుంచి లకిడీకపూల్ వరకు పోలీసు బలగాలు పహారాకాయనున్నాయి. ఒక ఐజి, ఇద్దరు డిఐజి, నలుగురు డిసిపి, ఆరుగురు ఎసిపి, 30మంది సిఐ, 45మంది ఎస్‌ఐలు, 500 మంది కానిస్టేబుల్ , 600మంది హోంగార్డులతో అసెంబ్లీ వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభమనప్పటి నుంచి సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీ వద్ద రహదారులను మళ్లించనున్నారు.
అసెంబ్లీలోకి ప్రవేశించే ఎంఎల్‌ఎ, మంత్రుల వద్ద పనిచేసే సిబ్బంది, మీడియా ప్రతిధులకు ప్రత్యేక పాసులను జారీ చేశారు. తనిఖీలు నిర్వహించిన తరువాతే అంసెంబ్లీలోనికి అనుమతించాలని పోలీసు బాసులు ఆదేశాలిచ్చారు. దీంతో అసెంబ్లీ సమావేశాల దృష్యా పోలీసులు తనిఖీలు, బందోబస్తు నిర్వహించనున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో ఎలాంటి అవాంతరం లేకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాలలో స్థానిక పోలీసులతో పాటు టిఎస్‌ఎస్‌పి బలగాలను సైతం వినియోగించనున్నామని తెలిపారు. అసెంబ్లీ పరిసరాలతో పాటు మంత్రుల ఇళ్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, అసెంబ్లీ సమావేశాల నిమిత్తం బందోబస్తులో భాగంగా రాష్ట్ర పోలీస్ విభాగం అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.