Monday, January 20, 2025

సిటీకి మరో సరికొత్త ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్…పీఆర్ టిఎస్!

- Advertisement -
- Advertisement -

 

PRTS

హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరో సరికొత్త రవాణా అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్‌కు ఇప్పటికే ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎస్)కు తోడు పర్సనలైజ్డ్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్)ను అందుబాటులోకి తెచ్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మెస్సర్స్‌ అల్ర్టా పీఆర్‌టీ లిమిటెడ్‌తో హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పురపాలకశాఖ వెల్లడించింది.

రాయదుర్గం మెట్రోస్టేషన్‌ నుంచి 7.5 కిలోమీటర్ల పరిధిలోని మైండ్‌స్పేస్‌, ఇనార్బిట్‌ మాల్‌, అరబిందో, నాలెడ్జి సిటీ, మైహూ భుజా, ఐటీసీ కోహినూర్‌ వరకు పీఆర్‌టీఎస్ ను తీసుకురానున్నట్లు శుక్రవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పురపాలక శాఖ వెల్లడించింది. ఇది అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్‌లో ఉద్యోగాలు చేసే సుమారు 4.50 లక్షల మందితో సాధారణ ప్రయాణికులకు ఉదయం, రాత్రివేళల్లో ప్రయాణ ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే కారిడార్‌-2లో భాగంగా పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ విధానం తీసుకురానున్నారు. అసెంబ్లీ నుంచి సచివాలయం మీదుగా ప్యారడైజ్‌ మెట్రో స్టేషన్‌ వరకు సుమారు 8.84 కిలోమీటర్ల మేర పర్సనలైజ్డ్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌) రానుంది.

పీఆర్‌టీఎస్‌ అంటే..

పీఆర్‌టీఎస్‌కు మెట్రో మాదిరిగా ఎంపిక చేసిన మార్గంలో ఎలివేటెడ్‌ ట్రాక్‌ ఉంటుంది. కారు ఆకారంలో ఉండే ఇందులో కేవలం నలుగురి నుంచి ఆరుగురు మాత్రమే ప్రయాణించే పాడ్‌కార్లు ఉంటాయి. ట్రాక్‌కు అనుసంధానం చేసే విద్యుత్‌పై ఆధారపడి ఇవి నడుస్తుంటాయి. ఆటోమేటిక్‌ వ్యవస్థ ద్వారా రద్దీ మార్గాల్లో 5 నుంచి 8 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇవి నడుస్తాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ బెంగళూరులోని 5 మార్గాల్లో ప్రతిపాదించినట్లు మెట్రోరైల్‌ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News