ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన సమాఖ్య డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : తునికాకు టెండర్లు పూర్తిచేసి తక్షణమే తునికాకు ప్రూనింగ్ పనులు చేపట్టాలని తెలంగాణ గిరిజన సమాఖ్య డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన, గిరిజనేతర పేదలకు తునికాకు సేకరణ రెండవ ప్రధాన పంటగా ఉంటుందని సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ అన్నారు. అలాంటి తునికాకు టెండర్ల ప్రక్రియ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టెండర్లను పిలిచి పూర్తయిన వెంటనే తునికాకు ప్రూనింగ్ పనులు. ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు ఉపాధి కల్పిస్తున్న తునికాకు సేకరణ పనులను ప్రతి సంవత్సరం జనవరి నెల ఆఖరి నాటికి టెండర్ల ప్రక్రియను అటవీ శాఖ పూర్తి చేసేదని, ఈ సంవత్సరం చాలా జాప్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా టెండర్ పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే సీజన్ మించిపోతుందని, ఆదివాసి గిరిజనులు ఆందోళన చెందుతున్నారని అంజయ నాయక్ తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రక్రియ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 14 జిల్లాల్లో తునికాకు సేకరణను ప్రతి సంవత్సరం అటవీశాఖ చేపడుతుందని, అందులో ఏజెన్సీ జిల్లాల్లో తునికాకు సేకరణ కీలకమని ఆయనన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల. మంది గిరిజన, గిరిజనేతర ప్రజలు తునికాకు సేకరణపై ఆధారపడి జీవనం సాగిస్తూ లబ్ధి పొందుతున్నారన్నారు. లోడింగ్, అన్‌లోడింగ్ ఉల్టా పల్టా జట్కా పనులతో పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తోందన్నారు. ప్రతి ఏటా టెండర్ల ప్రక్రియ పూర్తైన వెంటనే ఫిబ్రవరిలో ప్రూనింగ్ పనులు చేస్తారని, ఫలితంగా నాణ్యత ఎక్కువ దిగుబడి వస్తుందని, కాని ఈపని సకాలంలో జరగలేదన్నారు. అటవీ శాఖ స్పందించడంలో జాప్యం జరిగిందని, ఈ సీజన్ ద్వారా వచ్చే ఆదాయంలో గిరిజనులు అనేక ఆర్దిక కార్యకలాపాలను. తమ పిల్లల కోసం వారి కుటుంబ పోషణ కోసం. శుభకార్యాలను నిర్ణయించుకుంటారని తెలిపారు.
ఈ సంవత్సరం ఇప్పటికీ టెండర్లు కూడా పిలవకపోవడం వల్ల గిరిజనులు ఆందోళన చెందుతున్నారని అంజయ్య నాయక్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో తునికాకు దొరికే ఏరియాలలో తునికాకు కార్మికులు, గిరిజనులు ఉపాధి కోల్పోకుండా తక్షణమే ప్రక్రియ పూర్తి చేసి తునికాకు ప్రూనింగ్ పనులు ప్రారంభించాలని కోరారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతంలో తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి భూక్య శ్రీనివాస్, అధ్యక్షులు సొందే కుటుంబరావుల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టెండర్లు ప్రక్రియను పూర్తి చేసి గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరులైన తునికాకు సేకరణ పనులను మొదలుపెట్టి గిరిజనులను ఆదుకోవాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపు నిచ్చేందుకు గిరిజన సమాఖ్య వెనుకాడబోదని గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది.