Friday, November 22, 2024

సైకో కిల్లర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

16మంది మహిళలను హత్యచేసిన నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్, రాచకొండ పోలీసులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: పదహారు మంది మహిళలను దారుణంగా హత్య చేసిన సైకో కిల్లర్‌ను హైదరాబాద్ నార్త్ జోన్ టా స్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, రాచకొండ పోలీసులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో అతడి అరాచకాలు బయటికి వచ్చాయి. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు… నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు 16 మందిని దారుణంగా హత్య చేసినట్లు, చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అంతేకాకుండా రాయదుర్గం, శామీర్‌పేట, మేడ్చేల్, బొల్లారం, ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశాడు. నిందితుడు రాములు సిద్దిపేట, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు చేశారు. సంఘారెడ్డి జిల్లా, కండి మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనా రాములు రాళ్లు కొట్టేవాడు. నిందితుడికి 21ఏళ్లకు వివాహం జరిగింది. 1998లో వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్య వేరే వ్యక్తితో వెళ్లి పోయింది. దీంతో చుట్టుపక్కల వారు రాములను చులకనగా చూసేవారు. అవమాన భారం తట్టుకోలేక రాములు రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె కూడా వదిలివేయడంతో రాములు మానసికంగా ఇబ్బందులు పడ్డాడు. దీంతో సైకోగా మారాడు, మూడో వివాహం చేసుకున్నా ఆమెతో సరిగ్గా ఉండలేదు. నగరంలోని వెంకటగిరికి చెందిన కావాల వెంకటమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో మరో మహిళ మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేయడంతో నిందితుడి ఘోరాలు బయటపడ్డాయి. కూలీ పనిచేసే వెంకటమ్మ కనిపించడంలేదని భర్త అనంతయ్య ఫిర్యాదు చేశాడు. యూసుఫ్‌గూడలోని కల్లు కాంపౌండ్ వద్ద నిందితుడు వెంకటమ్మ కనిపించడంతో మాయమాటలు చెప్పి ఘట్‌కేసర్, అంకుషాపూర్ వద్దకు తీసుకుని వెళ్లాడు, అక్కడ ఇద్దరు మద్యం మత్తులో గొడవ పడ్డారు. దీంతో ఆవేశంతో బాధితురాలని రాములు హత్య చేసి అక్కడ పడేసి వెళ్లాడు.

పోలీసులు బాధితురాలు వెంకటగిరికి చెందిన వెంకటమ్మగా గుర్తించారు. సిసి కెమెరాల్లో వెంకటమ్మ ఓ వ్యక్తితో ఆటోలో వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు పాత నేరస్థుడు రాములుగా గుర్తించారు. అతడి ఫొటో ఆధారంగా దర్యాప్తు చేసిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు చేసిన నేరాలు బయటపడ్డాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిందితుడు ఏడు హత్యలు చేశాడు. దీంతో ఎస్‌ఓటి పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. రంగారెడ్డి న్యాయస్థానం రాములకు 2011లో జీవిత ఖైదు విధించింది. రాములను చర్లపల్లి జైలుకు తరలించగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో జైలు అధికారులు చికిత్స కోసం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఐదుగురు ఖైదీలతో కలిసి పారిపోయాడు, పారిపోయిన తర్వాత ఐదుగురు మహిళలను హత్య చేశాడు. బోయిన్‌పల్లి ఇద్దరు, చందానగర్‌లో ఇద్దరు, దుండిగల్ ఒకరిని హత్య చేశాడు. దీంతో బోయిన్‌పల్లి పోలీసులు 2013లో రాములను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. జైలులో ఉన్న రాములు హైకోర్టుకు లేఖ రాయడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. 2018, అక్టోబర్ 3న జైలు నుంచి విడుదలైన తర్వాత శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను, పఠాన్‌చెరువు పిఎస్ పరిధిలో మరో మహిళను హత్య చేశాడు. ఈ హత్యల కేసులో పోలీసులు రాములను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడు గత ఏడాది జూలై31వ తేదీన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఐదు నెలలు బాగానే ఉన్న రాములు గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన బాలానగర్‌లోని ఉన్నకల్లు కంపౌండ్ వద్దకు వెళ్లి ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆమెకు డబ్బులు ఆశచూపి సిద్దిపేట జిల్లా, ములుగు పిఎస్ పరిధిలోని జాప్త సింగాయపల్లి గ్రామ శివారుకు తీసుకుని వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించిన తర్వాత మహిళతో శారీరక వాంఛ తీర్చుకుని ఆ తర్వాత చీరతో గొంతుకు బిగించి హత్య చేశాడు, ఆమె ఒంటిపైఉ న్న కడియాలు,వెండి ఆభరణాలు తీసుకుని వెళ్లాడు. పోలీసులు గుర్తుతెలియని మహిళ మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
మహిళలపై ధ్వేషం…
నిందితుడి భార్యలు విడిచి వెళ్లడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడు. ఒంటరిగా కల్లుదుకాణాలు, వైన్ షాపులకు వచ్చే మహిళలను లక్షంగా చేసుకుని హత్యలు చేస్తున్నాడు. ఇలా 16మంది మహిళలకు మాయమాటలు చెప్పి, డబ్బులు ఆశచూపి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకుని వెళ్లి హత్యలు చేశాడు. బాధితులకు కల్లు తాగించి అధికంగా డబ్బులు ఇస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకుని వెళ్లి హత్య చేశాడు.
ఆధారాలు లేకే శిక్షపడలేదు…
గతేడాది వరకు 16 మందిని హత్య చేసినప్పటికీ, పోలీసులు క్షేత్ర స్థాయిలో సరైన ఆధారాలు సేకరించకపోవడంతో నిందితుడు రాములుకు సరైన శిక్షలు పడలేదు. నిర్మానుష్య ప్రాంతాలకు మహిళలను తీసుకుని వెళ్లి హత్య చేయడంతో విషయం బయటపడే సరికి మృతదేహాలు కుల్లి పోవడంతో శాస్త్రీయ ఆధారాలు సేకరించలేకపోయారు.

Psycho killer arrested by Task Force Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News