డబ్బుల కోసం భిక్షమెత్తుకుని వారిని చంపిన నిందితుడు
కర్ణాటకకు చెందిన నిందితుడు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: ఇద్దరు భిక్షగాళ్లను హత్య చేసిన సైకో కిల్లర్‌ను హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం, బీదర్ , హుమ్నాబాద్ తాలూక, బగ్‌దల్ గ్రామానికి చెందిన ఎండి ఖధీర్ నగరంలోని బోరబండలోని సఫ్‌దర్ నగర్‌లో ఉంటున్నాడు. చిన్నప్పుడే బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు. నిందితుడికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులు ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం లేబర్ పని చేస్తున్నాడు. భార్యతో విభేదాలు రావడంతో నగరంలోని ఫుట్‌పాత్‌పై ఉంటున్నాడు. నిందితుడు తనతో స్నేహంగా ఉంటున్న వ్యక్తిని 2018లో హత్య చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితుడు లేబర్ పనిచేస్తు ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నాడు. నిందితుడిపై గతంలో హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు ఉన్నాయి. చేస్తున్న పనిలో వస్తున్న డబ్బులు వ్యసనాలకు సరిపోకపోవడంతో భిక్షగాళ్ల వద్ద డబ్బులు బలవంతంగా తీసుకుంటున్నాడు.
ఈ 1వ తేదీన టాబండ్ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న భరత్ టిఫిన్ సెంటరు ఎదుట భిక్షమెత్తుకుంటున్న వ్యక్తి (35 నుంచి 40) నిద్రిస్తున్నాడు. అతడిని నిందితుడు నిద్రలేపి అగ్గిపెట్టే అడిగాడు. తర్వాత డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దానికి అతడు నిరాకరించడంతో బండరాయితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి ప్యాకెట్‌లో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్లాడు. అక్కడి నుంచి నిందితిడు ఖదీర్ నాంపల్లి రైల్వేస్టేషన్ ఏరియాకు వెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన వ్యక్తి ఖాజా ఆటోట్రాలీలో నిద్రిస్తున్నాడు. తనకు కూడా నిద్రించేందుకు చోటు ఇవ్వాల్సిందిగా కోరాడు. దానికి ఖాజా నిరాకరించడంతో బండరాయితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు హత్యలను నిందితుడు నాలుగు గంటల వ్యవధిలోనే చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హబీబ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. హబీబ్‌నగర్ ఇన్స్‌స్పెక్టర్ నరేందర్, తదితరులు కేసు దర్యాప్తు చేశారు.