సిటిబ్యూరోః ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని వరుసగా హత్యలు చేసి దోచుకుంటున్న సైకో కిల్లర్‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఇప్పటి వరకు మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఆరు కేసుల్లో ఎనిమిది మందిని హత్య చేశాడు. రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్‌రెడ్డి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్, మాణిక్యమ్మ కాలనీకి చెందిన బయ్యగారి ప్రవీణ్ కూలీ పనిచేస్తుంటాడు. వ్యసనాలకు బానిసగా మారడంతో ఇళ్లల్లో స్నేహితులతో కలిసి గతంలో ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. తన స్నేహితులతో కలిసి 2011లో ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకుని పారిపోయారు.
చైన్‌స్నాచింగ్, రాబరీ, చోరీలు, హత్యలు చేశాడు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన నిందితుడు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని హత్యలు చేసి వారి వద్ద ఉన్న సొత్తును తీసుకుని పారిపోతున్నాడు. ఈ క్రమంలోనే మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న ముగ్గురిని హత్య చేశాడు. ఈ నెల 8వ తేదీ నేతాజీ నగర్ రైల్వే ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్నాడు, అక్కడికి చేరుకున్న నిందితుడు అతడి పక్కన పడుకున్నట్లు కొద్ది సేపు ఉన్నాడు. తర్వాత బాధితుడు గాఢ నిద్రలోకి జారుకోగానే పక్కన ఉన్న బండరాయితో తలపై కొట్టి అతడి వద్ద ఉన్న డబ్బులను తీసుకుని పారిపోయాడు. తర్వాత 20వ తేదీన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వప్న థియేటర్ మేయిన్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్నాడు అతడి పక్కన పడుకున్నట్లు నటించి తర్వాత అతడిని బండరాయితో కొట్టి చంపాడు,
అతడి వద్ద ఎలాంటి ఖరీదైన వస్తువులు లభించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి దుర్గా నగర్ ఎక్స్ రోడ్డు వద్దకు వచ్చిన ప్రవీణ్ అక్కడ టెంపరరీ షెడ్ వేసుకుని నిద్రిస్తున్న బాధితుడిని చూశాడు. అతడి సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నట్లు కొద్ది సేపు ఉన్నాడు. తర్వాత బండరాయితో తలపై కొట్టి చంపివేశాడు. తర్వాత అతడి వద్ద ఉన్న డబ్బులను తసీఉకుని పారిపోయాడు. వరుసగా హత్య కేసులు నమోదు కావడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పాత నేరస్థుడు ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు మధు, రాజేందర్ గౌడ్‌ను డిసిపి అభినందించారు.