Wednesday, January 22, 2025

పాలకుల ఉల్లంఘనలపై ఉదాసీనత!

- Advertisement -
- Advertisement -

ప్రజాప్రతినిధులైన పాలకులు ఏనాడో వాణిజ్యవేత్తల వస్తువులుగా మారారు. ఈనాడు సరుకులు అయ్యారు. విలువలను, విధులను మరిచారు. యథా రాజా తథా ప్రజా. చైతన్య శక్తులు బలహీనపడ్డాయి. ప్రజాఉదాసీనత పెరిగింది. పాలితుల విధులు, బాధ్యతలు, పౌర విలువలు, ఓటర్ల కర్తవ్యాలు కూడా సరుకులుగా మార్చబడ్డాయి. కేవలం ఉపయోగ విలువ కలిగి, ప్రయోజనాలను మాత్రమే కలిగించే పదార్థం వస్తువు. అమ్మకాలు, కొనుగోళ్ళకు గురయిన వస్తువు సరుకు. అంటే నేటి నాయకుల బాధ్యతలు, విధులు, ప్రజల అభిప్రాయాలు, వోట్లు అమ్మకాలకు, కొనుగోళ్లకు గురవుతున్నాయన్నమాట. ఈ స్థితికి పాలకులదే బాధ్యత. అంతర్యుద్ధాన్ని సమర్థతతో ఎదుర్కొని బానిసత్వ నిర్మూలన చట్టం చేసిన అమెరికా పూర్వ అధ్యక్షులు అబ్రహాం లింకన్ వర్ణించినట్లు ప్రజల కోసం, ప్రజల చేత ఏర్పడే ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్యం. కోట్లాది ప్రజలు పాలనలో పాల్గొనలేరు. వారి ప్రతినిధులు ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రభుత్వం, చట్టాల ఏర్పాటు, కార్యనిర్వహణలలో పాల్గొంటారు. ఈ ప్రజా ప్రతినిధులు ప్రజలకు బాధ్యులుగా, విశ్వాసపాత్రులుగా, శ్రేయోభిలాషులుగా ఉండాలి. ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను నియమిస్తారు. ప్రాంతాల, ప్రజాసాంద్రత ఆధారంగా నిర్ణయించిన నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో అర్హత గల పౌరులు పోటీ పడతారు. వోటు హక్కు గల పౌరులు వారికి వోటేస్తారు. ఎక్కువ వోట్లు పొందిన అభ్యర్థులు ప్రజాప్రతినిధులవుతారు. మెజారిటి పార్టీ లేదా కూటమి నాయకుడు ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి అవుతారు. ప్రభుత్వ అధిపతి అవుతారు. ప్రజాస్వామ్యంలో సూత్రప్రాయంగా ప్రజలే నాయకులు. ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలను, అవసరాలను తీర్చే నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలు చేయాలి. స్వార్థానికి, స్వార్జనకు, ఆశ్రిత పక్షపాతానికిపాల్పడరాదు. ఆదాయ, లాభాల పదవులు చేపట్టరాదు. కొందరు లాభార్జనల వాణిజ్యవేత్తలుగా కొనసాగుతున్నారు. నేడు దీనిపై నియంత్రణ లేదు.

ప్రజలు సమాజానికి బాధ్యతలు గల సజీవ స్తంభాలు. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, చట్టాలను పాటించడం, దేశాధికారాన్ని, సమైక్యత సమగ్రతలను, ప్రజల ఆస్తులను కాపాడటం, పన్నులు చెల్లించడం, సాంస్కృతిక వారసత్వ స్థలాల, ప్రకృతి, పర్యావరణాల భద్రత, సంరక్షణ, సౌభ్రాతృత్వ నిర్వహణ రాజ్యాంగం నిర్దేశించిన పౌరుల నైతిక బాధ్యతలు, విధులు. ప్రజలు తమ హక్కులనే కాదు బాధ్యతలనూ తెలుసుకోవాలి, నిర్వహించాలి. ఇవి సమాజ వికాసానికి, దేశ ప్రగతికి దోహదపడతాయి. చాలా మందికి పార్లమెంటు, శాసన సభల సభ్యుల పాత్ర, బాధ్యతలు తెలియవు. ప్రజా హక్కుల రక్షణ ప్రజాస్వామ్య లక్ష్యం. సమానత్వ, మత స్వేచ్ఛ, దోపిడీ నిరోధం, సంస్కృతి, విద్య, ఆరోగ్యం, స్వేచ్ఛమొదలగు ప్రాథమిక హక్కులను రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది. ఈ హక్కుల భద్రత ప్రభుత్వ బాధ్యత. ప్రజలకు విద్యవైద్యాలను ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. శాస్త్రీయ దృక్పథం, మానవవాదం, జిజ్ఞాస, సంస్కరణల స్ఫూర్తి పెంపుకు పౌరులు పాటు పడాలని రాజ్యాంగం ఆదేశించింది. ఒకరి హక్కులో మరొకరి బాధ్యత ఉంటుంది. పాలకులూ ప్రజలే.

వారు బాధ్యతల నిర్వహణలో ఆదర్శంగా ఉండాలి. అప్పుడే ప్రజల హక్కులు రక్షించబడతాయి. బాధ్యతలు, విధుల పట్ల ప్రజల పట్టనితనం కంటే పాలకుల అశ్రద్ధ సమాజానికి, దేశానికి ఎక్కువ హాని చేస్తుంది. ప్రాథమిక హక్కులతో పాటు విధులను ప్రజలు మరువరాదు. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను పాలకులు తమ అధికార నిర్వహణకు, ఆస్తుల సంపాదనకు కాకప్రజల సౌకర్యం కోసం అమలు చేయాలి.నేటి ప్రజాప్రతినిధులలో అత్యధికులు నేరస్థులే. మన పాలకులు విద్య ఆరోగ్యాలను నిజీకరించారు. ప్రైవేటు సంస్థలకు ఇచ్చా రు. నియమ నిబంధనలను గాలి కొదిలి ప్రకృతి వనరులను, దేశ సపందను తమ ఆశ్రితులకు అతి చవకగా అమ్మేస్తున్నారు. తస్మదీయ వాణిజ్యవేత్తలను బెదిరించివారి ఆధీనంలోని ప్రజాసౌకర్య వాణిజ్య వనరులను అస్మదీయులకు అప్పజెపుతున్నారు. అనేక రకాల అవినీతులను ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజల, ప్రజాప్రతినిధుల కొనుగోళ్ళకు అక్రమంగా కోట్లాది నిధులు లాక్కుంటున్నారు. వారే ప్రత్యక్ష పరోక్ష అత్యాచారాలకు, హత్యలకు, మతోన్మాద మానవ హననాలకు కారణమవుతున్నారు. వోటర్లను కొనడం పాత పద్ధతి.

ఈ రోజు ప్రజాప్రతినిధులనే కొంటున్నారు. తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు, ప్రభుత్వాలను మారుస్తున్నారు. రాజ్యాంగ నిర్దేశిత లౌకికత్వానికి తూట్లు పొడుస్తున్నారు. మన ప్రథమ సేవకుడు ప్రధాని నెహ్రూ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌నే సోమనాథ్ దేవాలయ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరుకావద్దని, లౌకిక దేశఅధ్యక్షునికి అది తగదని రాశారు. ప్రపంచ సర్వధర్మ (వైదికవాద) సమావేశాలకు వెళ్ళొద్దని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇద్దరికీ సలహా ఇచ్చారు. రెండు సందర్భాలలో వారు మేము హాజరవుతామని భీష్మించారు. ఆ నేపథ్యంలో మీరు రాజేంద్రప్రసాద్ గా, రాధాకృష్ణన్‌గా వెళ్ళాలి. మీ ప్రాతినిధ్యానికి ఖజానా నుండి రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదని ఆంక్షలు విధించారు. నేటి ప్రధాన సేవకుడు మోడీ పౌరోహిత్య అర్హత, సపత్ని సహచరి కాకపోయినా దేవాలయాల శంకుస్థాపనలు, ప్రారంభాలు తానే హిందుత్వ విరుద్ధంగా చేస్తున్నారు. రామాలయ నిర్మాణ సంస్థను నియమించమని ప్రభుత్వాన్ని ఆదేశించే అలౌకిక తీర్పుల స్థాయికి కోర్టులను దిగజార్చారు.

సమానత, మత స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, జీవించే హక్కులను ఏకపక్ష నల్ల చట్టాలతో రద్దు చేస్తున్నారు. దేశ సమాఖ్య స్వభావాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్రాల జాబితాలోని అంశాల్లో చట్టాలు చేస్తున్నారు. వ్యవసాయ, విద్యుత్తు వితరణ సవరణ చట్టాలు ఈ కోవలోవే. స్టాన్ స్వామి జైలు చావులను, 90 శాతం వికలాంగుడు ఆంగ్ల భాషాచార్యులు సాయిబాబా దశాబ్దాల బెయిలు లేని జైలు జీవితాలను పట్టించుకోని నాయకులు అవినీతి ఆరోపణలపై తమ అరెస్టులు అన్యాయం అంటారు. రోగాలు అప్పుడే బయటపడతాయి. తమదే నిజం అంటారు. తమ మాట నెగ్గింపే ప్రజాస్వామ్య విజయమని యాగీ చేస్తారు. పార్టీ వరిష్ట నాయకులను వదిలేసి కుటుంబ సభ్యులే ప్రచారాలు చేస్తారు. వారసత్వ రాజకీయాలకు ఇది నాంది. అధికారులు సొంత కులస్థుల దగ్గర కూడా లంచాలు తీసుకోకుండా తమ విధులను నిర్వహించరు. చట్టాలను గౌరవించరు. పన్నులు ఎగ్గొడతారు. దేశ సమగ్రత, సమైక్యతలు పట్టవు.

దేశ సంపద ఆక్రమణలో వారేవిక్రములు. తమ కులస్థులకు, మతస్థులకు కూడా సాయం చేయరు. అలా చేసి ఉంటే మతాలయాల ముందు అడుక్కునేవారు ఉండేవారే కాదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను కులమతాల ఆధారంగా విభజిస్తారు. అమాయక ప్రజలు ఈ ఉచ్చులోపడి స్వార్థ రాజకీయ రెచ్చగొట్టుళ్ళకు లొంగుతున్నారు. అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథానికి పాలక పాలిత వర్గాలు రెండూ తిలోదకాలిచ్చాయి. మత అసహనంతో ఇరు వర్గాలకు పూనకం వస్తుంది. ఎక్కడా సౌభ్రాతృత్వం కనపడదు. ప్రతి చోటా మోసాలు, కుట్రలు, కుతంత్రాలే. నేటి పాలకులు ఆధిపత్య భావజాల ఆచార్యులు. అధిక సంఖ్యాక మతస్థుల పక్షపాతులు. వైదికావాదులే సంఘ్ ప్రజలు. మతోన్మాద పెట్టుబడిదారి పాలకులకు బహుళజాతి సంస్థల యజమానులు, వాణిజ్యవేత్తలు, సంపన్నులు వస్తువులు. పేదలు, దళితులు, స్త్రీలు, వెనక్కు నెట్టబడ్డ కులాలవారు సరుకులు. మానవత్వం, మనిషితత్వం నిరాకరించబడ్డ జీవులు చైతన్యంతో ఆలోచించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News