హైదరాబాద్: యాదవ మహాసభను విజయవంతం చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి అన్నారు. తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను టీఆర్‌ఎస్ ప్రభుత్వం 22 శాతానికి కుదిస్తూ 2018 డిసెంబర్ లో నిర్ణయం తీసుకుందన్నారు. చివరికి బీసీ రిజర్వేషన్లు 18 శాతానికి చేశారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఓబీసీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. పార్టీ ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు బలబోయిన రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీల కుల గణన జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జేకే శేఖర్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, అలా బాబు గౌడ్, అక్కల బాబుగౌడ్, మారం తిరుపతి యాదవ్, బాల మల్లేష్ యాదవ్, మహేందర్ యాదవ్ పాల్గొన్నారు.