రోజురోజుకు పెరుగుతున్న ధరలు
ప్రజల బతుకులు ఛిన్నాభిన్నం
సమస్త ప్రజానీకం సమ్మెలోనే
వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ సభ సక్సెస్
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి అధికారంలోకి వచ్చినప్పట్నించీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్లకు తెగనమ్ముతోందని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. ఆ విధానాలు దేశప్రయోజనాలకే ప్రమాదకరమని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల, రైతుల, సమస్త ప్రజల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న చర్యలకు నిరసనగా దేశభక్తియుత సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తా నుంచి కూచిగూడ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు.
దీనికి ముందుగా నారాయణగూడ చౌరస్తాలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర నాయకులు ఈటి నర్సింహా, ఎన్డీ నాయకులు ఝాన్సీ, సంధ్య, ప్రజా పంథా నాయకులు అన్మేశ్, ఎంసిపిఐ(యు) నాయకులు వనం సుధాకర్‌ల అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నరసింహారావు మాట్లాడుతూ మోడీ సర్కార్ విధానాల వల్ల దేశంలో కార్మికులు, కర్షకులకు, ఉద్యోగ వర్గాలు, ఇతర తరగతుల ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని చెప్పారు. ఎవరి బతుకులకూ భద్రత లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను దేశీయ, విదేశీయ, కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు.
కార్మికవర్గం ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న హక్కులను అణిచివేస్తున్నదని చెప్పారు. బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియా, రైల్వేలు, పోర్టులు తెగనమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీలాగే నక్కపై తాటిపండుపడ్డట్టుగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై గ్యాస్, ప్రెటోలు, డీజిల్, వంటనూనె, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచిందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న నరేంద్ర మోడీ ఖబడ్దార్ అని హెచ్చరించారు. సేవా పబ్లిక్ సెక్టార్ నినాదంతో ఉద్యమిస్తామని చెప్పారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా ఉండేది వామపక్షాలేనని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగాన్ని అమ్మటమంటే.. దేశం కంటే, ప్రజల కంటే కార్పొరేట్లు ఎక్కువ అయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) ఎన్డీ కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, ఎస్యుసిఐ కార్యదర్శి మురారి, ఎంసిపిఐ(యు) కార్యదర్శి గాజర్ల రవి, లిబరేషన్ కార్యదర్శి రాజేశ్, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.