Saturday, November 23, 2024

రహానె, పుజారాలకు ఇదే చివరి ఛాన్స్?

- Advertisement -
- Advertisement -

Pujara and Rahane chance in series against South Africa

ఈసారి విఫలమైతే అంతే సంగతులు!

మన తెలంగాణ/క్రీడా విభాగం: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఛాన్స్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నా వీరికి మరో అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక న్యూజిలాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి పుజారా, రహానెలకు మరో అవకాశం ఉంటుందనే సంకేతాన్ని ఇచ్చాడు. అయితే జట్టులో చోటు దక్కితే దక్షిణాఫ్రికా సిరీస్ ఇద్దరిరీ సవాల్ వంటిదేనని చెప్పక తప్పదు. కొంతకాలంగా వీరు వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. అయితే కీలకమైన సౌతాఫ్రికా సిరీస్‌లో ఇద్దరికీ మరో అవకాశం కల్పించాలని బిసిసిఐ భావిస్తోంది. బౌన్స్‌కు అనుకూలంగా ఉండే సౌతాఫ్రికా పిచ్‌లపై వీరిద్దరూ కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో రహానె, పుజారాలను సిరీస్‌కు ఎంపిక చేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో రాణిస్తేనే వీరికి టీమిండియాలో అవకాశాలు సజీవంగా ఉంటాయి.

ఒకవేళ సిరీస్‌లో విఫలమైతే మాత్రం జట్టులో చోటు కాపాడు కోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశమేనని చెప్పాలి. ఇప్పటికే ఇద్దరికీ ఎన్నో అవకాశాలు దక్కాయి. అయినా కూడా తమ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై ఇద్దరు దృష్టి సారించడం లేదు. పుజారా అయితే మరింత చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. రెండేళ్లుగా టెస్టుల్లో ఒక్క శతకం కూడా నమోదు చేయలేక పోయాడు. అతనికి లభించినన్నీ అవకాశాలు మరే బ్యాటర్‌కు లభించలేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడూ టీమిండియాలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా పుజారా ఓ వెలుగు వెలిగాడు. సిరీస్ ఏదైనా పరుగుల వరద పారించడం పరిపాటిగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా పుజారా బ్యాటింగ్ తీసికట్టుగా తయారవుతోంది. ప్రతి సిరీస్‌లోనూ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. అయినా కూడా గతంలో అతను సాధించిన రికార్డులను దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ కొంత కాలంగా టీమిండియాలో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వస్తున్నారు. యువ ఆటగాళ్ల రాకతో ఇటు పుజారా అటు రహానెకు ప్రతికూల పరిస్థితి ఏర్పడింది.

సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, కెఎల్.రాహుల్ తదితరులతో వీరికి తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి స్థితిలో వీరిద్దరూ టీమిండియాలో ఎక్కువ కాలం నెట్టుకు రావడం చాలా కష్టమైన పనేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పుజారాపై వేటు కూడా వేశారు. అయితే అతనికి మరో అవకాశం ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టుపడడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో బాగానే ఆడినా తర్వాత మళ్లీ తరచూ విఫలమవుతూ వస్తున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లలో విఫలమయ్యాడు. అంతేగాక కివీస్‌తో జరిగిన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా నిరాశ పరిచాడు. ఇక ప్రస్తుత కివీస్ సిరీస్‌లో కూడా చెత్త బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. ఇక పేలవమైన బ్యాటింగ్ కారణంగా అజింక్య రహానె రెండో టెస్టులో స్థానం పొందలేక పోయాడు. అయితే వీరికి దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఆ సిరీస్‌లో రాణించక పోతే మాత్రం టీమిండియాలో చోటు నిలబెట్టుకోవడం కష్టమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News