Thursday, December 26, 2024

ఇద్దరికీ ఇదే చివరి అవకాశం..

- Advertisement -
- Advertisement -

ఇద్దరికీ ఇదే చివరి అవకాశం..
పుజారా, రహానెలకు కీలకంగా మారిన ఆఖరి టెస్టు!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లోనే అత్తుత్తమ బ్యాట్స్‌మెన్‌లుగా పేరు తెచ్చుకున్న సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారా కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. తరచు విఫలమవుతున్నా గత ప్రదర్శన దృష్టిలో పెట్టుకుని తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ పుజారా, రహానె అంతంత మాత్రం బ్యాటింగ్‌నే కనబరిచారు. కేవలం రెండో ఇన్నింగ్స్‌లో మాత్రమే అర్ధ సెంచరీలు సాధించారు. ఇక సౌతాఫ్రికాతో జరిగే మూడో టెస్టు ఈ ఇద్దరు దిగ్గజాలకు చివరి అవకాశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి విఫలమైతే మాత్రం రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సంపాదించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. బౌన్స్‌కు సహకరించే సౌతాఫ్రికా పిచ్‌లపై వీరి అనుభవం పనికొస్తుందనే ఉద్దేశంతోనే సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ జట్టు యాజమాన్యం తమపై పెట్టిన నమ్మకాన్ని కాపాడడంలో ఇటు పుజారా, అటు రహానె విఫలమయ్యారనే చెప్పాలి. అందివచ్చిన అవకాశాన్ని ఇద్దరు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమయ్యారు.

వాండరర్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కాస్త బాగానే ఆడినా కీలక సమయంలో వెనుదిరిగి మరోసారి నిరాశ పరిచారు. ఇద్దరు కనీసం మరో వంద పరుగులు జోడించి ఉన్నట్లయితే మ్యాచ్ ఫలితం కచ్చితంగా టీమిండియాకు అనుకూలంగా ఉండేది. ఇద్దరు వెంటవెంటనే వికెట్లను చేజార్చుకుని జట్టును కష్టాల్లోకి నెట్టారు. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరూ శతకంతో చెలరేగి ఉన్నా భారత్ మరింత మెరుగైన స్కోరును సాధించేది. కానీ ఇద్దరు పేలవమైన షాట్లతో వికెట్లను పారేసుకున్నారు. వీరు వెనుదిరిగిన తర్వాత టీమిండియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఒకవేళ ఇద్దరు మరికొంత సేపు తమ వికెట్లను కాపాడుకుని ఉంటే దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక సిరీస్ విజయం భారత్‌కు సొంతమయ్యేది. ఇక ఈ సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌లో ఆడిన పుజారా 72 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండో టెస్టులో సాధించిన ఓ అర్ధ సెంచరీ కూడా ఉంది. లేకుంటే పుజారా చేసిన పరుగులు 20ను కూడా దాటకపోయేవి. దీన్ని బట్టే మిస్టర్ డిపెండబుల్ పుజారా బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగుతుందో ఊహించుకోవచ్చు.

విరాట్ కోహ్లి, రోహిత్ వంటి సీనియర్ల సేవలు అందుబాటులో లేని సమయంలో పుజారా, రహానె బాధ్యతలు మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా ఇద్దరు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా బ్యాటింగ్‌ను చేయడంలో విఫలమవుతున్నారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం రానున్న మ్యాచ్‌లోనైనా ఇద్దరు మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. ఈసారి విఫలమైతే మాత్రం రానున్న సిరీస్‌లలో వీరికి టీమిండియాలో చోటు దక్కడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి నిలవడంలో వీరికి ఎవరూ సాటిరారు. ఒక్కసారి గాడిలో పడితే వీరిని ఆపడం ఎంత పెద్ద బౌలర్‌కైనా చాలా కష్టంతో కూడుకున్న పనే. దీంతో సౌతాఫ్రికాతో జరిగే మూడో టెస్టు ఇటు పుజారాకు, అటు రహానె చారో రేవోగా మారింది. ఇందులో రాణించి టీమిండియాలో చోటు కాపాడుకుంటారో లేక జాతీయ జట్టుకు శాశ్వతంగా దూరమవుతారో వేచి చూడాల్సిందే.

Pujara and Rahane failure batting against South Africa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News