Monday, December 23, 2024

దివంగత ఫోటోగ్రాఫర్ దానిశ్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు

- Advertisement -
- Advertisement -

Pulitzer Prize for late photographer Danish Siddiqui

భారత్‌లో కరోనా మరణ మృదంగ చిత్రాలు తీసినందుకు

న్యూయార్క్ : ఏడాది క్రితం అఫ్గానిస్థాన్ ఘర్షణల సమయంలో తాలిబన్ కాల్పుల్లో దుర్మరణం చెందిన భారత ఫొటోగ్రాఫర్ దానిశ్ సిద్దీఖీకి మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. భారత్‌లో కరోనా మరణాలపై ఆయన తీసిన చిత్రాలకు గాను పులిట్జర్ అవార్డు ప్రకటించారు. 2022 సంవత్సరానికి గాను పులిట్జర్ ప్రైజ్ విజేతలను సోమవారం ప్రకటించారు. ఇందులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్ సంస్థకు చెందిన డానిశ్ సిద్దిఖీ, అద్నన్ అబిదీ, సన్నా ఇర్షాద్, అమిత్ దవేను విజేతలుగా ప్రకటించారు. భారత్‌లో కొవిడ్ మరణాలపై వీరు తీసిన చిత్రాలకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు కమిటీ వెల్లడించింది. కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి సమయంలో ఢిల్లీ సహా పలుప్రాంతాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఒకేసారి అనేక మంది మరణించడంతో పలు శ్శశాన వాటికల్లో సామూహిక అంత్యక్రియిలు చేపట్టారు.

అందుకు సంబంధించి సిద్దీఖీ తీసిన ఫోటోలు అప్పట్లో సంచలనంగా మారాయి. కొవిడ్ ఉద్ధృతి సమయంలో ఆయన తీసిన ఎన్నో చిత్రాలు భారత్‌లో మహమ్మారి పరిస్థితులకు అద్దం పట్టడమే గాక, ఎంతో మంది హృదయాలను కదలించాయి. కాగా, సిద్దీఖీ పులిట్జర్ పురస్కారం గెలుచుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు 2018 లో మయన్మార్ లోని రోహింగ్యా శరణార్ధుల ఫోటోకు తొలి పులిట్జర్ అందుకున్నారు. ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసిన సిద్దిఖీ తొలుత పలు టీవీ ఛానళ్లలో కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత 2010 లో రాయిటర్స్ సంస్థలో ఫోటో జర్నలిస్టుగా చేరారు. ఆ సంస్థ తరఫున దేశ, విదేశాల్లో అనేక సంచలన వార్తలను కవర్ చేశారు. హాంకాంగ్ అల్లర్లు, రోహింగ్యా ఆందోళనలకు సంబంధించిన ఫోటోలు తీశారు.

గతేడాది అఫ్గాన్‌లో అమెరికా, నాటో సేనల ఉపసంహరణ నేపథ్యంలో ప్రభుత్వ దళాలు తాలిబన్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును కవర్ చేసేందుకు వెళ్లిన ఆయన విధి నిర్వహణలోనే తుది శ్వాస విడవడం విషాదకరం. అఫ్గానిస్థాన్ లోని కాందహార్‌లో గల స్విస్ బోల్డక్ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత తాలిబన్లు అఫ్గాన్ బలగాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వార్తను కవర్ చేసేందుకు సిద్దీఖీ … అఫ్గాన్ దళాలతో కలిసి అక్కడకు వెళ్లారు. అక్కడ ఆయన తీసిన ఆఖరి ఫోటో ఇదే.ఈ ఘర్షణలను కవర్ చేసే సమయంలో 15 గంటల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఆయన మధ్యలో 15 నిమిషాల పాటు విరామం దొరకడంతో పచ్చిక పైనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఫోటోను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అదే ఆయన చివరి విశ్రాంతి అయింది. తర్వాత జరిగిన కాల్పుల్లో సిద్దీఖీ మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News